ఆ ఇద్దరు అన్నదమ్ముల వల్లే రెండుసార్లు ఓడిపోయాం.. టీడీపీ నేత బండారు
ఆ ఇద్దరు అన్నదమ్ముల వల్ల టీడీపీ 2009, 2019లో రెండుసార్లు ఓటమి ఎదుర్కుందని సత్యనారాయణమూర్తి చెప్పారు. వీరు గెలవరు.. ఇతరులను గెలవనివ్వరు.. అన్న చందంగా పరిస్థితులు తయారు చేశారన్నారు.
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ రెండుసార్లు ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథం పేరుతో టీడీపీ నాయకులు చేపట్టిన ఉత్తరాంధ్ర బస్సు యాత్ర గురువారం టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి ప్రారంభమైంది.
ఈ సందర్భంగా పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీకి రెండుసార్లు ఓటములు ఎదురయ్యాయని వ్యాఖ్యానించారు. 2009లో టీడీపీ ఆధ్వర్యంలోని మహాకూటమి గెలిచే అవకాశం ఉందని అందరూ భావించారని.. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి టీడీపీకి ఓటమి ఎదురైనట్లు చెప్పారు. ఆ తర్వాత 2019లో కూడా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన వల్ల టీడీపీకి ఓటమి ఎదురైందన్నారు.
ఇలా ఆ ఇద్దరు అన్నదమ్ముల వల్ల టీడీపీ 2009, 2019లో రెండుసార్లు ఓటమి ఎదుర్కుందని సత్యనారాయణమూర్తి చెప్పారు. వీరు గెలవరు.. ఇతరులను గెలవనివ్వరు.. అన్న చందంగా పరిస్థితులు తయారు చేశారన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించడం వల్ల ఒకసారి, పవన్ కళ్యాణ్ జనసేన వల్ల మరొకసారి టీడీపీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చిందని సత్యనారాయణమూర్తి అన్నారు.
కాగా, సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయని పవన్ కళ్యాణ్ టీడీపీకి, బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించగా.. తన వల్లే టీడీపీకి విజయం సాధ్యమైందని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తిప్పి కొట్టారు. నీవల్లే తామేమీ గెలవలేదని.. సొంత బలం వల్లే గెలిచామని.. పవన్‌ను తిట్టిపోశారు.
ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో 2019లో పవన్ బీజేపీతో కలిసి పోటీ చేశారు. ఇప్పుడు జగన్ ఓటమే తన లక్ష్యం అంటూ టీడీపీతో పోటీ చేసేందుకు పవన్ సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. పరిస్థితులు ఈ విధంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్, చిరంజీవిపై బండారు సత్యనారాయణమూర్తి తన అక్కసు వెళ్లగక్కడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో మరి.