మరో మేనిఫెస్టోకు టీడీపీ కసరత్తు

పార్ట్‌ 2గా ప్రజల ముందుకు రానున్న ఈ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీపై కీలక హామీలున్నాయని తెలుస్తోంది. రైతులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ, డ్వాక్రా మహిళలకు పెద్ద మొత్తంలో రుణ మాఫీ హామీ ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని సమాచారం.

Advertisement
Update:2023-07-08 11:20 IST

ఎన్నికలకు చాలా ముందుగానే మినీ మేనిఫెస్టోను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మరో అడుగు ముందుకేయనుంది. భవిషత్తుకు గ్యారెంటీ పేరిట విడుదల చేసిన మొదటి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు వివిధ వర్గాలకు చెందిన ప్రజలను ఆకర్షించేందుకు సూపర్‌సిక్స్‌ పాలసీలను ప్రకటించారు. దసరా నాటికి పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తామని అప్పుడే ప్రకటించారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ తొలివిడతలో విడుద‌ల చేసిన మినీ మేనిఫెస్టో ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పక్క రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ కొట్టారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోని టీడీపీ ఇప్పుడు రెండో మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

పార్ట్‌ 2గా ప్రజల ముందుకు రానున్న ఈ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీపై కీలక హామీలున్నాయని తెలుస్తోంది. రైతులకు లక్ష రూపాయల వరకు రుణ మాఫీ, డ్వాక్రా మహిళలకు పెద్ద మొత్తంలో రుణ మాఫీ హామీ ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని సమాచారం. ఒక వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి మిళితంగా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నారట. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే పథకాలను ప్రకటించడంతో పాటు, ఉపాధి కల్పనపై మేనిఫెస్టోలో చర్చించనున్నారట. రైతులు, మహిళలకు వరాలు కురిపించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. పేదలకు ఆర్థిక ఆసరా, ఆరోగ్య పథకాలు కూడా ఈ మేనిఫెస్టోలో ఉండనున్నాయి.

మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టోని విడుద‌ల చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమాన్ని అందిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. మహిళల కోసం 3 సిలిండర్లు ఫ్రీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలు ప్రకటించారు. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వీటికి మించి పార్ట్‌ -2 మేనిఫెస్టో ఉంటుందంటున్నారు పార్టీ నేతలు.

మేనిఫెస్టో విడుదలతో పాటు, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది. సంక్షేమ పథకాల పేరిట వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించిందనే వాస్తవాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. మొదటి మేనిఫెస్టోతో కాపీ పేస్ట్ హామీలు కురిపించారనే విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ, మరి ఈసారి ఎలాంటి హామీలతో ముందుకు వస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News