బాబుకు బీఆర్ఎస్ భయం.. త్వరలో కీలక సమావేశం

ఆంధ్రా ఓటర్లు బీఆర్ఎస్‌కు ఓట్లు వేస్తారా? లేదా అనేది తర్వాత విషయం. కానీ ఏపీ టీడీపీని కూడా కేసీఆర్ బలహీనపరుస్తారేమో అని చంద్రబాబు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందు జాగ్రత్త పడాలని భావిస్తున్నారు.

Advertisement
Update:2022-10-07 20:28 IST

కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు మీడియాలో విస్తృతమైన ప్రచారం లభించింది. తెలంగాణ, ఏపీలో బీఆర్ఎస్ గురించే గత రెండు రోజులుగా మాట్లాడుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో కేసీఆర్ ఏపీలోని విజయవాడ లేదా వైజాగ్‌లో బహిరంగ సభ పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా, టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామని భావిస్తున్న కేసీఆర్‌కు సామాన్య ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఎప్ప‌టిలాగే తమదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వల్ల ఒరిగేదేమీ లేదని అంటున్నారు. కానీ, టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు మాత్రం వారి మాటలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే, అన్నింటికంటే ముఖ్యమైన చర్చ ఏపీలో జరుగుతోంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో ఆంధ్ర పాలకులను కేసీఆర్ కాస్త ఘాటుగానే విమర్శించారు. అప్పటికి ఆ మాటలు అవసరమే కాబట్టి కేసీఆర్ అలా మాట్లాడారని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అదే సమయంలో కేసీఆర్ పాత వ్యాఖ్యలను మళ్లీ గుర్తు చేస్తూ కాంగ్రెస్, వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అప్పట్లో మమ్మల్ని తిట్టి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారని అంటున్నారు. కనీసం కేసీఆర్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకరని విమర్శిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ తరపున మేము బరిలో దిగుతున్నామంటూ కొందరు ఫ్లెక్సీల కట్టడం గమనార్హం. ఏపీలోని చాలా ప్రాంతాల్లో కేసీఆర్‌ను సపోర్ట్ చేస్తూ గులాబీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇలా ఎవరి హడావిడిలో వాళ్లు ఉండగా టీడీపీ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.

బీఆర్ఎస్ పార్టీ పేరు ప్రకటించిన రోజు చంద్రబాబును స్పందించమని విలేకరులు కోరగా.. చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు. బయటకు వ్యాఖ్యలు చేయకపోయినా.. చంద్రబాబు, టీడీపీలో కేసీఆర్ భయం పట్టుకున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో టీడీపీలోనే ఉన్న కేసీఆర్.. 2014 తర్వాత తెలంగాణలో ఆ పార్టీ ఊసే లేకుండా చేశారు. కీలక నేతలను టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చారు. కొంత మందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. తెలంగాణలో టీడీపీ ప్రాధాన్యం లేకుండా చేశారు. ఏపీలోని టీడీపీ నేతలతో కూడా కేసీఆర్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పటికీ కొంత మంది ఆయనతో టచ్‌లో ఉంటారు. ఏవైనా శుభకార్యాలు, ఫంక్షన్లు జరిగినప్పుడు వారిని కలుస్తూనే ఉన్నారు.

టీడీపీలో ఉండే అసంతృప్త నేతలను బీఆర్ఎస్ వైపు తీసుకెళ్తారనే అనుమానం చంద్రబాబును వెంటాడుతోంది. వైసీపీలో టికెట్ల కోసం భారీ పోటీ ఉంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్లు ఏదో ఒక పార్టీ టికెట్ ఆశిస్తారు. అలాంటి వారిలో గెలుపు గుర్రాలను వెతికి బీఆర్ఎస్‌లోకి తీసుకెళ్తారేమో అనే అనుమానాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా ఓటర్లు బీఆర్ఎస్‌కు ఓట్లు వేస్తారా? లేదా అనేది తర్వాత విషయం. కానీ ఏపీ టీడీపీని కూడా కేసీఆర్ బలహీనపరుస్తారేమో అని చంద్రబాబు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందు జాగ్రత్త పడాలని భావిస్తున్నారు.

రెండు మూడు రోజుల్లో టీడీపీలోని కీలక నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేపథ్యంలోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తి చూపిస్తున్నది ఎవరు? కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నది ఎవరనే విషయాలను చంద్రబాబు ఆరా తీస్తున్నారు. టీడీపీ నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నవారితో పాటు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న వారితో మాట్లాడాలని బాబు అనుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్‌తో ఎలా వ్యవహరించాలి? ఆ పార్టీపై విమర్శలు చేయాలా? లేదంటే మిత్రభావంతో వెళ్లాలా అనే విషయాలు కూడా చర్చించనున్నారు. బీఆర్ఎస్ కనుక ఏపీలో పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉన్నట్లు కూడా బాబు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి అసందర్భ వ్యాఖ్యలు చేయవద్దని నేతలకు బాబు సూచించినట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News