గంటాతో తెలుగుదేశానికి తంటా
తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఎన్నికైన నుంచీ టీడీపీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. అధిష్టానం నిర్దేశించిన ఏ కార్యక్రమం చేపట్టరు.
పొలిటికల్ టూరిస్టు గంటా శ్రీనివాసరావు ఎత్తులు, పైఎత్తులు అర్థం కాక తెలుగుదేశం పార్టీ డైలమాలో పడుతోంది. గంటాని వదిలించుకోనూ లేదు. ఉంచుకోనూ లేదు. క్రమశిక్షణ చర్యలు తీసుకోలేరు. పార్టీలో యాక్టివ్‌గా ఉండాలని గట్టిగా చెప్పలేరు. గంటాతో ఏంటీ తంటా అని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయ్యన్నపాత్రుడులాంటి సీనియర్ నేత కూడా గంటాపై టీడీపీ అధిష్టానం నాన్చుడు ధోరణిపై ఆగ్రహంగా ఉన్నారు. గంటాని టచ్ చేస్తే టీడీపీని ఆర్థికంగా ఆదుకునే ఆయన వియ్యంకుడు నారాయణని కోపం వస్తుందనే భయమే టీడీపీ మౌనానికి కారణం అయ్యుండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.
2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన గంటా శ్రీనివాసరావు, పార్టీ దారుణ పరాజయం పాలవడంతో అప్పటి నుంచి పార్టీకి అంటీముట్టనట్టు ఉంటున్నారు. వైసీపీలో చేరాలని విశ్వప్రయత్నం చేశారు. జనసేనతో మంతనాలు జరిపారు. కమలనాథులతో బేరాలు అయిపోయాయి. కాపు సామాజికవర్గం సమావేశాలు పెడుతూ ఇటీవల మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చారు. తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఎన్నికైన నుంచీ టీడీపీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. అధిష్టానం నిర్దేశించిన ఏ కార్యక్రమం చేపట్టరు.
పార్టీలు కంటే అధికారం ఎక్కడుంటే అక్కడ గంటా ఉంటారని ఆయన రాజకీయ చరిత్ర స్పష్టం చేస్తోంది. తొలిసారి 1999లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా, 2004 ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యంలో చేరి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు మంత్రిగా చాన్స్ కొట్టేశారు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అనంతరం 2019 విశాఖ ఉత్తరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.
అన్ని పార్టీల పెద్దలతో సత్సంబంధాలున్న గంటా శ్రీనివాసరావు ఎటువైపు వెళతారో ఇప్పటివరకూ స్పష్టత లేదు. టీడీపీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఇతర నేతలు గంటా శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోలేని అశక్తత అధిష్టానానికి ఎందుకు అని తమలో తామే చర్చించుకుంటున్నారు. ఇటీవల పరిణామాలు పరిశీలిస్తే బీఆర్ఎస్ వైపు గంటా మొగ్గు చూపుతున్నారని అర్థం అవుతోంది.