గాజు గ్లాసుపై పిటిషన్ ఉపసంహరించుకున్న టీడీపీ
ఈ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉండే నియోజకవర్గాల్లో ఆ పార్టీలకు తీవ్ర నష్టం చేయడం ఖాయమని అర్థమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తును జనసేన పార్టీకే రిజర్వ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను టీడీపీ ఉపసంహరించుకుంది. హైకోర్టులో తమ పిటిషన్‌ను కొట్టేయడం ఖాయమని అర్థమై, ఇక చేసేదేమీ లేక వెనక్కి తగ్గింది. తమ పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని, అందువల్ల గాజుగ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు గానీ, గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలకు గానీ కేటాయించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని టీడీపీ ఈ పిటిషన్ దాఖలు చేసింది.
అయితే ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ మొదలైందని, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వడానికి రాజ్యాంగం అంగీకరించదని ఎన్నికల సంఘం నివేదించడంతో హైకోర్టు ఆ దిశగా ఉత్తర్వులివ్వడానికి సిద్ధమైంది. దీంతో తమ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేయడం ఖాయమని అర్థమైన టీడీపీ.. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ మేరకు హైకోర్టు అనుమతి కోరింది. దీనికి వెంటనే హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులిచ్చారు.
ఇక ఈ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉండే నియోజకవర్గాల్లో ఆ పార్టీలకు తీవ్ర నష్టం చేయడం ఖాయమని అర్థమవుతోంది. టీడీపీ, బీజేపీ పోటీలో ఉండే స్థానాల్లో గాజు గ్లాసు కూడా ఉండటం వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశముంది. జనసేన ఓటర్లు గాజు గ్లాసుపైనే ఓటేస్తే మాత్రం ఆ ఓట్లన్నీ టీడీపీ, బీజేపీల అభ్యర్థులకు నష్టం చేసే అవకాశముంది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఆయా అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.