మార్పు మొదలైంది, మనదే అధికారం

పులివెందులలో తుపాకీ సంస్కృతి వచ్చిందని, మొన్న గొడ్డలి, ఇప్పుడు తుపాకి అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం చారిత్రక అవసరం తెలుగువారందరికీ ఉందన్నారు చంద్రబాబు.

Advertisement
Update:2023-03-29 21:43 IST

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ తిరుగుబాటు మొదలైందని, గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయమే దీనికి నిదర్శనం అని అన్నారు చంద్రబాబు. మళ్లీ ఏపీలో అధికారంలోకి వస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తెస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన టీడీపీ ఆవిర్భావ సభలో ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల టీడీపీ అధ్యక్షులు, ఇతర కీలక నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ విభజన కంటే నవ్యాంధ్రకు జగన్‌ వల్లే ఎక్కువ నష్టం జరిగిందని విమర్శించారు చంద్రబాబు. జగన్ ని సైకో అనాలో, దద్దమ్మ అనాలో, చేతకాని వ్యక్తి అనాలో, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టాడని అనాలో అర్థం కావడం లేదన్నారు. ఏపీలో పరిస్థితి చూస్తే బాధేస్తోందని చెప్పారు. అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. పులివెందులలో తుపాకీ సంస్కృతి వచ్చిందని, మొన్న గొడ్డలి, ఇప్పుడు తుపాకి అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం చారిత్రక అవసరం తెలుగువారందరికీ ఉందన్నారు చంద్రబాబు.

ఎన్టీఆర్‌ తెచ్చిన పాలనా సంస్కరణలు చరిత్రలో ఎక్కడా లేవన్నారు చంద్రబాబు. సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం అని చెప్పారు. సంస్కరణలకు మారు పేరు ఎన్టీఆర్‌ అని, చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశంపార్టీ ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీకి ముందు.. తర్వాత అని మాట్లాడే పరిస్థితి ఉందన్నారు.

పేదల ఆకలి తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని, ప్రతి తెలుగు బిడ్డ సగర్వంగా తల ఎత్తుకునేలా చేశారని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్‌ నవజాతికి మార్గదర్శకం అని, యువతకు ఆదర్శం అని, ఎన్టీఆర్‌ కు మరణం లేదని అన్నారు. నిత్యం వెలిగే మహోన్నత దీపం ఎన్టీఆర్ అని కొనియాడారు బాలకృష్ణ.

పాలనా పరమైన సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పారు బాలకృష్ణ. అలాంటి గొప్ప వ్యక్తికి గుర్తుగా పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం మార్చడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. ఏపీలో మార్పు మొదలైందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో అందరిలో ఉత్సాహం నెలకొందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు బాలయ్య. 

Tags:    
Advertisement

Similar News