ఆ వార్తలపై నేను స్పందించను.. - చంద్రబాబు
మళ్లీ ఎన్డీఏలోకి టీడీపీ వెళ్తోందనే ప్రచారంపై చంద్రబాబు స్పందించారు. ఆనాడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు.
ఎన్డీఏలో టీడీపీ చేరుతుందని ప్రచారం చేసేవాళ్లే దానికి సమాధానం చెప్పాలని, తాను స్పందించనని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీ అనుకూల ఛానల్ రిపబ్లిక్ లో అలయెన్స్ కథనం రావడంతో ఒక్కసారిగా ఏపీతో పాటు తెలంగాణలోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. పొత్తు వార్తలపై వైసీపీ మండిపడగా, బీజేపీ ఏం లేదని తేల్చేసింది. మళ్లీ ఎన్డీఏలోకి టీడీపీ వెళ్తోందనే ప్రచారంపై చంద్రబాబు స్పందించారు. ఆనాడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే ఇప్పుడు జగన్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామని కుండబద్దలు కొట్టారు. అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ రెండు సార్లు నష్టపోయిందన్నారు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనే తపనతో వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామని చెప్పారు. సంక్షేమ పథకాలని ఆరంభించిందే తెలుగుదేశం పార్టీ అని, మళ్లీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం అమలు చేస్తామన్నారు. రాష్ట్ర విభజన వల్ల ప్రజల్లో భయాందోళనలు ఎన్నో ఉన్నా, ఆర్థికలోటు లోనూ తెలంగాణ కంటే మెరుగ్గా ఇక్కడ సంక్షేమం, ఇతర కార్యక్రమాలు అమలు చేశామని చెప్పుకొచ్చారు.