చంద్రబాబులో పెరిగిపోతున్న పంచ భయాలు

ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు భయాల మధ్య రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక టీడీపీ అధినేత చంద్ర‌బాబు అవస్థ‌లు పడుతున్న‌ట్లు ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఇంతకీ చంద్రబాబులోని ఆ ఐదు భయాలు ఏమిటి?

Advertisement
Update:2023-06-25 11:40 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదైలన తర్వాత చంద్రబాబు నాయుడులో భయాలు పెరిగిపోతున్నాయట. ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు భయాలు పెరుగుతున్నట్లు తమ్ముళ్ళే చెబుతున్నారు. ఈ భయాల మధ్య రాబోయే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక అవస్థ‌లు పడుతున్నారు. ఇంతకీ చంద్రబాబులోని ఆ ఐదు భయాలు ఏమిటి? ఏమిటంటే మొదటిది ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామో లేదో అన్న భయం. రెండోది జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నిసీట్లు వదులుకోవాలో తెలియ‌దు.

మూడోది ఏమిటంటే కాపుల ఓట్లు టీడీపీకి ట్రాన్సఫర్ అవుతుందో లేదో అనే భయం. ఇక నాలుగో భయం ఏమిటంటే పొత్తుల్లో సీట్లు కోల్పోయే తమ్ముళ్ళు తమ నియోజకవర్గాల్లో ఏమి చేస్తారో అర్థంకావటంలేదు. ఫైనల్‌గా ఐదో భయం ఏమిటంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం. నిజానికి ఈ ఐదు భయాలు కూడా చాలా కీలకమైనవనే చెప్పాలి. ఇప్పుడు విషయం ఏమిటంటే నేతలతో జరిగిన రాష్ట్ర స్థాయి సమీక్షలో చాలామంది తమ్ముళ్ళు అసలు ఎవరితోనూ పొత్తు వద్దని చంద్రబాబుతో గట్టిగానే చెప్పారు.

అయితే పొత్తులు లేకుండా ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళటానికి చంద్రబాబుకు ధైర్యం సరిపోవటంలేదు. అందుకనే పొత్తులు.. పొత్తులు అని కలవరిస్తున్నారు. ఇక్కడే తమ్ముళ్ళు చంద్రబాబుకు చెబుతున్నది ఏమిటంటే పొత్తులు అనివార్యమనుకుంటే జనసేనతోనే చాలంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తువద్దని, పెట్టుకుంటే టీడీపీకి నష్టమని చెబుతున్నారు. ఇక తాజా పరిణామాలను చూస్తుంటే జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వారాహి యాత్రలో ముద్రగడ పద్మనాభంపై పవన్ చేసిన అవినీతి ఆరోపణలతో కాపు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోతోంది. ముద్రగడ-పవన్ మధ్య కాపు నేతల్లో స్పష్టమైన చీలిక వచ్చేస్తోంది. దీంతో ముద్రగడను పవన్ అనవసరంగా కెలికారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.

పొత్తు పెట్టుకుంటే మిత్రపక్షాలకు కనీసం 50 సీట్లకు పైగా వదులుకోవాల్సుంటుందని తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సీట్లు కోల్పోయే తమ్ముళ్ళు మిత్రపక్షాల గెలుపున‌కు సహకరించకపోతే అవన్నీ వైసీపీ ఖాతాలో పడటం ఖాయమని చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. చివరి భయం బీజేపీతో పొత్తు. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే ఒక సమస్య, పెట్టుకుంటే మరో సమస్య. బీజేపీ మీద జనాల్లోని మంట టీడీపీ మీద కూడా పడితే మొదటికే మోసం వస్తుందేమో అనే టెన్షన్ చంద్రబాబులో పెరిగిపోతోందట. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News