కేశినేని బ్రదర్స్ మధ్య చిచ్చుపెట్టిన బాబు..

తన పేరు హోదా ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తి వీఐపీ స్టిక్కర్ తో విజయవాడ, హైదరాబాద్ లలో కారులో తిరుగుతున్నాడంటూ ఆమధ్య కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Update:2022-07-20 16:12 IST

అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ములు చంద్రబాబు వల్ల విడిపోయారు. 2019 ఎన్నికల్లో అన్న కేశినేని నాని గెలుపుకోసం కృషి చేసిన తమ్ముడు కేశినేని చిన్ని ఇప్పుడు అన్నకు బద్ధ శత్రువుగా మారిపోయాడు. ఆమధ్య నానితో చంద్రబాబుకి కాస్త వ్యవహారం చెడింది. దీంతో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయన తమ్ముడు చిన్నిని ప్రోత్సహించడం మొదలు పెట్టారు బాబు. పక్కా ప్రణాళికతో నానిని పక్కన పెట్టారు. దీంతో అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ములు ఇప్పుడు బద్ధశత్రువులుగా మారిపోయారు. పోలీస్ కేసుల వరకూ వ్యవహారం వెళ్లింది.

తన పేరు హోదా ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తి వీఐపీ స్టిక్కర్ తో విజయవాడ, హైదరాబాద్ లలో కారులో తిరుగుతున్నాడంటూ ఆమధ్య కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు పరిగణలోకి తీసుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అక్కడితో ఆగలేదు, నాని ఇచ్చిన కార్ నెంబర్ ఆధారంగా ఆ కారు ఎక్కడ‌ కనపడినా చెకింగ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో పోలీసులు ఈ కారుని ఆపారు, చెకింగ్ చేసి పంపించేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అన్నదమ్ములిద్దరూ గొడవలతో రోడ్డున పడటం, కేసులు పెట్టుకోడానికి అసలు కారణం చంద్రబాబేనంటూ విమర్శలు మొదలయ్యాయి.

విజయవాడ ఎంపీగా వరుసగా రెండుసార్లు టీడీపీ నుంచి కేశినేని నాని గెలిచారు. ఎన్నికల ప్రచారంలో రెండుసార్లు ఆయన సోదరుడు చిన్ని కీలక పాత్ర వహించారు. రెండోసారి పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నాని కాస్త అంటీ ముట్టనట్టు ఉన్నారు. పలు సందర్భాల్లో ఆయన వేసిన ట్వీట్లు టీడీపీలో చర్చకు దారి తీశాయి. స్థానిక నాయకులతో ఆయనకు తీవ్ర విభేదాలున్నాయి. ఆమధ్య విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కేశినేని నాని కుమార్తె శ్వేత పోటీ చేశారు. బుద్ధా వెంకన్న, బోండా ఉమ వర్గానికి ఇది ఇష్టం లేకపోయినా సర్దుకు పోయారు. కార్పొరేటర్ గా శ్వేత గెలిచారు కానీ, విజయవాడలో టీడీపీ పరువు పోయింది. అప్పటినుంచి నాని వ్యతిరేక వర్గం ఆయన్ను బాగా టార్గెట్ చేసింది.

మహానాడుతో మరింత దూరం..

ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమానికి ఎంపీ నాని హాజరు కాలేదు. ఆయన కేడర్ కూడా రాలేదు. అదే సమయంలో కేశినేని చిన్ని వర్గం మహానాడులో క్రియాశీలకంగా పనిచేసింది. చంద్రబాబు ఆయన్ను దగ్గరకు తీయడం, ఈయన్ను దూరం పెట్టడంతో వ్యవహారం మరింత ముదిరింది. ఇటీవల ఎంపీల మీటింగ్ లో చంద్రబాబుని నాని కలసినా పెద్దగా మాట్లాడుకోలేదు. విజయవాడలో తన శత్రువుని చంద్రబాబే పెంచి పోషిస్తున్నారని నాని భావిస్తున్నారు. తన కుటుంబం నుంచే తనకు శత్రువుని తయారు చేశారని మరింతగా మండిపడుతున్నారు. అన్నదమ్ముల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News