టీడీపీ వర్సెస్ షర్మిల.. మధ్యలో జగన్ పై విమర్శలు
జగన్ ని ఉద్దేశపూర్వకంగానే ఇరుకున పెట్టాలని ఇరువర్గాలు భావించడం ఇక్కడ విశేషం. అటు టీడీపీ, ఇటు షర్మిల ఓ ప్లాన్ ప్రకారమే జగన్ పేరు ప్రస్తావించారని, వైసీపీని విమర్శించారని తెలుస్తోంది.
ఏపీలో ప్రభుత్వాన్ని కాకుండా ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ సరికొత్త పొలిటికల్ గేమ్ మొదలు పెట్టిన ఏపీసీసీ చీఫ్ షర్మిల.. ఇప్పుడు కాస్త ట్రాక్ మార్చారు. టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా ఆమె ఓ ట్వీట్ వేశారు. అయితే నేరుగా ప్రభుత్వాన్నో లేక, సీఎం చంద్రబాబునో ఆమె టార్గెట్ చేయలేదు, చేయాలని కూడా ఆమె అనుకోలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేశారు. రైతులు విత్తన కొరత ఎదుర్కుంటున్నారని అన్నారు. అయితే పనిలో పనిగా ఇక్కడ కూడా ఆమె జగన్ పేరు ప్రస్తావించడం, వైసీపీని విమర్శించడం విశేషం.
వైసీపీ ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్టలేదనే ప్రజలు కూటమికి పట్టం కట్టారని గుర్తు చేశారు షర్మిల. రైతుల్ని నిండా ముంచినందుకే జగన్ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. మోసం చేశారు కాబట్టే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని సెటైర్లు పేల్చారు. ఏపీలో రైతులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయలన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తక్షణం సమాధానం చెప్పాలని ట్వీట్ వేశారు షర్మిల.
అచ్చెన్న స్టైల్ కూడా అదే..
కూటమి ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు. ఆమెకు సమాధానం చెప్పాలంటే సూటిగా, స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ఇక్కడ అచ్చెన్నాయుడు కూడా జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది మీ అన్న జగన్ లాంటి పాలన కాదని, కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు ఎక్కడా విత్తనాల కొరత లేదని చెప్పుకొచ్చారు అచ్చెన్నాయుడు. సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అడుగులు పడుతున్న రాష్ట్రంలో రైతులను అనవసర భయాలకు గురి చేయొద్దని ఆమెకు సూచించారు. రాష్ట్రంలో ఖరీఫ్ లో ఇప్పటికే 5.1 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందించామన్నారు అచ్చెన్నాయుడు. ఇంకా విత్తన పంపిణీ కొనసాగుతోందని వివరణ ఇచ్చారు.
అంతా బాగానే ఉంది కానీ, మధ్యలో జగన్ ని ఉద్దేశపూర్వకంగానే ఇరుకున పెట్టాలని ఇరువర్గాలు భావించడం ఇక్కడ విశేషం. అటు టీడీపీ, ఇటు షర్మిల ఓ ప్లాన్ ప్రకారమే జగన్ పేరు ప్రస్తావించారని, వైసీపీని విమర్శించారని తెలుస్తోంది.