తిరుమలలో సర్వదర్శనం నిలిపివేత.. టీటీడీ అధికారులతో భక్తుల వాగ్వాదం

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శుక్రవారం టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తామని తొలుత టీటీడీ అధికారులు ప్రకటించారు. దీంతో టోకెన్లు దొరకని భక్తులు కూడా దర్శనానికి వచ్చారు.

Advertisement
Update:2023-12-22 17:33 IST

టీటీడీ అధికారులు తిరుమలలో సర్వదర్శనాన్ని నిలిపివేశారు. శనివారం వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి వేలాదిగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూలైన్ చేరుకుంది. దీంతో టిక్కెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను టీటీడీ అధికారులు అనుమతించడం లేదు.

ఈ విషయమై ఏటీసీ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుకు నిరసనగా అక్కడే బైఠాయించారు. వైకుంఠ ద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించి టోకెన్లు లేని భక్తులను దర్శనానికి అనుమతించడం లేదని టీటీడీ అధికారులు ప్రకటించారు. రేపటి సర్వదర్శనం టికెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూలైన్లోకి అనుమతిస్తామని వారు వెల్లడించారు.

టీటీడీ ప్రకటనతో తిరుమలకు భారీగా భక్తులు

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శుక్రవారం టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తామని తొలుత టీటీడీ అధికారులు ప్రకటించారు. దీంతో టోకెన్లు దొరకని భక్తులు కూడా దర్శనానికి వచ్చారు. ఊహించిన దాని కంటే ఎక్కువగా భక్తులు తరలిరావడంతో టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. భక్తులు భారీ సంఖ్యలో వచ్చినందువల్ల టోకెన్లు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని మరో ప్రకటన చేసింది.

టోకెన్లు లేకపోయినా శ్రీవారి దర్శనం కల్పిస్తామని అధికారులు ప్రకటించడంతోనే తిరుమలకు చేరుకున్నామని.. ఇప్పుడు దర్శనం నిరాకరించడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏటీసీ కూడలి వద్ద అధికారుల తీరుపై నిరసన తెలిపారు.

కాగా, వైకుంఠ ఏకాదశి కావడంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు తిరుమలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన 35 మంది జడ్జిలు శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. దీంతో వీఐపీలకు వసతి గదులు కేటాయించలేక టీటీడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News