జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్ వస్తుందా..?
గత ఎన్నికల సమయంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై కోడికత్తితో దాడి జరిగింది. ఆ కేసులో నిందితుడైన శ్రీనివాసులుకి ఐదేళ్లు బెయిల్ రాలేదు.
సీఎం జగన్ పై రాయితో జరిగిన దాడి కేసు ఇటీవల ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది. ఏప్రిల్ 13న విజయవాడ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ పై దాడి జరుగగా, రోజుల వ్యవధిలోనే నిందితుడు సతీష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్ కి ఇంకా బెయిల్ లభించలేదు. బెయిల్ పిటిషన్ పై తాజాగా విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది.
ఆసక్తిగా మారిన కేసు..
గత ఎన్నికల సమయంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై కోడికత్తితో దాడి జరిగింది. ఆ కేసులో నిందితుడైన శ్రీనివాసులుకి ఐదేళ్లు బెయిల్ రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతను బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇప్పుడు జగన్ పై రాయి వేసిన సతీష్ కి కూడా ఈ కేసులో బెయిల్ వస్తుందా లేదా అనేది అనుమానంగా ఉంది. సతీష్ ని అక్రమంగా ఈ కేసులో ఇరికించారని అతడి తరపు న్యాయవాది సలీం కోర్టుకి విన్నవించారు, బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. రేపు(మంగళవారం) తీర్పు ఇస్తారు.
జగన్ పై రాయిదాడి తర్వాత ఈ కేసు విషయంలో గందరగోళం నడిచింది. దాడి వెనక టీడీపీ నేతలు ఉన్నారనే ప్రచారం జరిగింది. తీరా సతీష్ అనే వ్యక్తిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇతర అరెస్ట్ లు జరగలేదు. జగన్ పై జరిగింది కేవలం దాడి కాదని, హత్యాయత్నం అని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ దశలో సతీష్ కి కోర్టు బెయిల్ ఇస్తుందో లేదో అనేది ఆసక్తిగా మారింది.