ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్

బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన తోట చంద్రశేఖర్ పలు విషయాలను వెల్లడించారు.

Advertisement
Update:2023-05-21 16:32 IST

ఏపీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఈ రోజు ప్రారంభించారు. గుంటూరు ఆటోనగర్ సమీపంలో నిర్మించిన ఐదంతస్తుల రాష్ట్ర కార్యాలయాన్ని ఆదివారం ఆయన లాంఛనంగా ప్రారంభించి.. మాట్లాడారు. దేశమంతా తెలంగాణ మోడల్‌ను విస్తరించే లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనున్నదని తోట చంద్రశేఖర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన తోట చంద్రశేఖర్ పలు విషయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకొని పోతున్నదని.. సాగు, తాగు నీటిని అందించడంలో విజయవంతం అయ్యిందని చెప్పారు. ఏపీలో మాత్రం సాగు, తాగునీటికి కష్టాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఏపీలో అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రశేఖర్ తెలిపారు.

కేంద్రంలోని బీజేపీ ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కుతుందని.. మతం పేరుతో దేశాన్ని ముక్కలు చేస్తోందని తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఇలాంటి మత ఛాందసవాదంతో ఉండటం వల్లే ఈ రోజు బీజేపీ దక్షిణాదిన ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకుండా పోయిందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినా.. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశం స్వీకరించే పరిస్థితలో లేదని చెప్పారు. కేంద్రంలోని మతతత్వా బీజేపీని గద్దె దించాలంటే ఫెడరల్ పార్టీలన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చారు. అదే సమయంలో కేంద్రంలోని ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వాన్ని ఢీకొంటున్నారు. దేశంలో మోడీని ప్రశించే వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని చెప్పారు.

తెలంగాణకు ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీలు క్యూకడుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిపోయింది. ఏపీలో మాత్రం కనీసం రాజధాని ఒక రాజధానిని నిర్మించుకోలేని పరిస్థితి ఉందని తోట చంద్రశేఖర్ అన్నారు. ఏపీలో అభివృద్ధి లేక రాష్ట్రం వెనకబడి పోతుంటే.. తెలంగాణ మాత్రం అభివృద్ధిలో దూసుకొని పోతోందని చెప్పారు. ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాక.. నిరుద్యోగం పెరిగిందని.. పక్క రాష్ట్రంలో మాత్రం పెట్టుబడుల వెల్లువ ఉందని చెప్పారు. దేశంలోకి రూ.13 కోట్ల పెట్టుబడులు వస్తే.. ఏపీకి వచ్చింది మాత్రం రూ.5,700 కోట్లు మాత్రమే అని చంద్రశేఖర్ చెప్పారు.

తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నారని చెప్పారు. కేటీఆర్ ఏకంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ లాగ పని చేస్తూ రాష్ట్రానికి అనేక పెట్టుబడులు, పరిశ్రమలు, సంస్థలు వచ్చేలా కృషి చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పినా.. ఇక్కడ ప్రశ్నించే వారు లేరని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కూడా నిధులు ఇవ్వడం లేదని.. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి ఏపీ ప్రభుత్వం నేర్చుకోవాలని తోట చంద్రశేఖర్ సూచించారు. 

Tags:    
Advertisement

Similar News