బీజేపీ వర్సెస్ జనసేన.. మధ్యలో శ్రీవాణి

బీజేపీ నేతలు వైసీపీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నరాని ప్రశ్నిస్తున్నారు జనసైనికులు. శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంలో బీజేపీ నేతలకు వాటా ఉందా అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు గుప్పించారు.

Advertisement
Update:2023-06-28 10:04 IST

బీజేపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేసినా, చేయకపోయినా ప్రస్తుతానికి మాత్రం ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నట్టే లెక్క. బహిరంగంగా ఆ రెండు పార్టీలు విమర్శించుకోవు. అలాగని కలసి కార్యక్రమాలు చేస్తాయా అంటే అదీ లేదు. ఎవరి దారి వారిది, ఎవరి లెక్కలు వారివి. అయితే సడన్ గా ఇప్పుడు తిరుమల శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారం ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి వ్యతిరేకించడంతో గొడవ మొదలైంది.

శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటూ వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆ తర్వాత వెంటనే చంద్రబాబు అదే పల్లవి అందుకున్నారు, టీడీపీ నేతలు కూడా పనిలో పనిగా టీటీడీపై నిందలు వేశారు. దీంతో నేరుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. శ్రీవాణి ట్రస్ట్ కార్యకలాపాలపై శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు, తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు టీటీడీకి మద్దతుగా బీజేపీ మాట్లాడటంతో జనసేన గొడవ చేస్తోంది.

శ్రీవాణి ట్రస్టులో విరాళాలు ప్రక్కదారి పట్టడం లేదని, ఆ విరాళాలను హిందూ దేవాలయాల నిర్మాణాలు, అందులో ధూపదీప నైవేద్యాలు, కైంకర్యాలకు వినియోగిస్తున్నారని వివరణ ఇచ్చారు భానుప్రకాష్ రెడ్డి. అనవసరంగా ట్రస్ట్ వ్యవహారాలను రాజకీయం చేయెద్దని అన్నారు. అంటే పరోక్షంగా ఆయన పవన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. దీనిపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు భానుప్రకాష్ రెడ్డి బీజేపీ నేతా, లేక వైసీపీ నేతా అని ప్రశ్నించారు జనసేన నేతలు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, అసలు బీజేపీ నేతలు వైసీపీకి ఎందుకు మద్దతు తెలుపుతున్నరాని ప్రశ్నిస్తున్నారు జనసైనికులు. శ్రీవాణి ట్రస్ట్ గోల్ మాల్ వ్యవహారంలో బీజేపీ నేతలకు వాటా ఉందా అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. దీంతో సోషల్ మీడియాలో కూడా రచ్చ జరుగుతోంది. 

Tags:    
Advertisement

Similar News