భార్య వేధింపులు, సీఐ బెదిరింపులు.. రైలు కిందపడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

ఆదివారం రాత్రి జరిగిన పంచాయితీలో తెల్లవారే లోపు రూ. 10 లక్షలు తీసుకువచ్చి ప్రియాంకకు ఇవ్వడంతో పాటు విడాకులకు అంగీకరించాలని లేనిపక్షంలో హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని సీఐ బెదిరించినట్టు తేజోమూర్తి బాబాయ్ ఆరోపిస్తున్నారు.

Advertisement
Update:2023-09-05 08:21 IST

భార్య వేధింపులకు సీఐ బెదిరింపులు కూడా తోడవడంతో ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఎనిమిది పేజీల ఒక లేఖ కూడా రాశాడు. ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన 26 ఏళ్ల తేజోమూర్తి హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 8 ఏళ్లుగా ఏలూరుకి చెందిన ప్రియాంకతో ప్రేమ వ్యవహారం నడుస్తోంది.

మూడు నెలల క్రితమే హైదరాబాద్ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తేజోమూర్తికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని ప్రియాంక అనుమానించింది. ఈ విషయంలోనే వీరిద్దరి మధ్య వరలక్ష్మీ వ్రతం రోజు ఇంట్లో ఘర్షణ జరిగింది. ప్రియాంకపై తేజోమూర్తి చేయి చేసుకున్నాడు. దాంతో ఆమె ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో తేజోమూర్తి పై కేసు పెట్టింది .

తేజోమూర్తికి పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని, అందుకే తనను వేధిస్తున్నాడంటూ కేసు పెట్టింది. మూర్తిని స్టేషన్ కు పిలిపించిన సీఐ రాజశేఖర్ పెద్దల సమక్షంలోనే విచారించారు. ఆదివారం రాత్రి జరిగిన పంచాయితీలో తెల్లవారే లోపు రూ. 10 లక్షలు తీసుకువచ్చి ప్రియాంకకు ఇవ్వడంతో పాటు విడాకులకు అంగీకరించాలని లేనిపక్షంలో హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని సీఐ బెదిరించినట్టు తేజోమూర్తి బాబాయ్ ఆరోపిస్తున్నారు.

రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చిన మూర్తి 8 పేజీల సూసైడ్ నోట్ రాసి తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఇంటి నుంచి మోటార్ సైకిల్ పై దెందులూరు రైల్వే స్టేషన్ కు వెళ్లి సమీపంలోనే రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తని కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా సీఐ పదేపదే కౌన్సెలింగ్ పేరిట వేధించడంతోపాటు రూ.10 లక్షలు వెంటనే తీసుకురావాలంటూ ఒత్తిడి తెచ్చారని, ఆ ఒత్తిడిని భరించలేక తేజోమూర్తి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

తన సూసైడ్ లెటర్లో తన భార్య తనను అక్రమ సంబంధాల పేరిట వేధిస్తోందని, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియాంక ఇలా చేయడాన్ని తాను తట్టుకోలేకపోతున్నానంటూ వివరించాడు. తెల్లవారేసరికి 10 లక్షల రూపాయలు తీసుకురావాలంటూ పోలీసుల ద్వారా ప్రియాంక వేధిస్తోందని వెల్లడించారు. తన మరణం తర్వాత అయినా తన నిజమైన ప్రేమను ప్రియాంక అర్థం చేసుకుంటుందని భావిస్తున్నట్టు లెటర్ రాశాడు.

*

Tags:    
Advertisement

Similar News