రామోజీ మీద కేసులు పెట్టకూడదా?

రామోజీ ఎలాంటి మోసాలకు పాల్పడలేదని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కూడా చెప్పలేదు. అంటే వీళ్ళ ఉద్దేశంలో రామోజీ మోసం చేస్తున్నా.. ప్రభుత్వం కేసులు పెట్టకూడదు, విచారణ చేయకుండా చూస్తూ ఊరుకోవాలంతే.

Advertisement
Update:2023-08-02 20:50 IST

మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావును వెనకేసుకు రావటానికి తెలుగుదేశం పార్టీకి కారణాలు ఏమీ దొరకలేదు. అందుకని ఒక పిచ్చి కారణాన్ని తెరమీదకు తెచ్చింది. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ గ్రహీత రామోజీరావుపై ప్రభుత్వం కేసులు నమోదు చేయటం ఏమిటంటూ మండిప‌డ్డారు. రామోజీపై ఏడు కేసులు పెట్టిన ప్రభుత్వం చివరకు ఏం సాధించిందని ఎద్దేవా చేశారు. ఒక్క‌రు కూడా ఫిర్యాదు చేయకుండానే మార్గదర్శిలో అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయని ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని బోండా ఆరోపించారు.

పద్మ పురస్కార గ్రహీత రామోజీ విషయంలో బోండా అడిగింది నిజంగానే వాలిడ్‌ పాయింట్ అనే అనుకుందాం. పద్మ పురస్కార గ్రహీతలు తప్పులు చేసినా, మోసాలకు పాల్పడినా ప్రభుత్వాలు కేసులు పెట్టకూడదా? విచారణ జరపకూడదా? పద్మ పురస్కారాలన్నది మోసాలు చేయటానికి, అవినీతి చేయటానికి లైసెన్సు కాదు. పద్మ పురస్కార గ్రహీతలను నేరారోపణలపై అరెస్టులు చేసిన ఉదాహరణలున్నాయి. నేరాలు నిరూపణ అయితే పురస్కారాలను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుంది. ఆ విషయాన్ని టీడీపీ నేతలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.

కక్షసాధింపుల్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్గదర్శిపై కేసులు పెట్టి రామోజీని వేధిస్తోందన్నారు. అంతేకానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యాపారమంతా చట్టాలకు లోబడే జరుగుతోందని, రామోజీ ఎలాంటి మోసాలకు పాల్పడలేదని బోండా కూడా చెప్పలేదు. అంటే వీళ్ళ ఉద్దేశంలో రామోజీ మోసం చేస్తున్నా.. ప్రభుత్వం కేసులు పెట్టకూడదు, విచారణ చేయకుండా చూస్తూ ఊరుకోవాలంతే. బోండా చెప్పిన పద్మవిభూషణ్ పురస్కారాన్నే ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు.

ఎలాగంటే కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తులకు, కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్యక్తులకు పద్మ పురస్కారాలు ఇవ్వకూడదు. 2016లో రామోజీకి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించేనాటికే ఆయనపై చీటింగు కేసులు నమోదయ్యాయి. మార్గదర్శి చీటింగ్ కేసు 2006 నుండే కోర్టుల్లో నలుగుతోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో రామోజీ మోసాలకు పాల్పడ్డారని సీఐడీ బల్లగుద్ది చెబుతోంది. ఈ కేసులో మొదటి నుండి ఫైట్ చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా రామోజీ మోసాలకు పాల్పడినట్లు అన్నీ ఆధారాలున్నాయంటున్నారు.

ఇవికాకుండా గతంలోనే మరో రెండు వేర్వేరు కేసుల్లో రామోజీ కోర్టు మెట్లెక్కారు. ఆ కేసుల్లో కోర్టు తీర్పు రామోజీకి వ్యతిరేకంగానే వచ్చింది. ఇలాంటి వివాదాస్పద వ్యక్తికి ప్రభుత్వం అసలు పద్మ పురస్కారం ఇవ్వనే కూడదని వాదించేవాళ్ళు కూడా ఉన్నారు. రామోజీకి పద్మవిభూషణ్ ఇవ్వటంపై ఎవరైనా కోర్టులో కేసు వేస్తే అదో తలనొప్పవుతుంది. మరీ విషయం బోండా ఆలోచించారా అనే సందేహం పెరిగిపోతోంది. పద్మవిభూషణ్ అయితే కేసులు పెట్టి విచారించకూడదన్నట్లుగా ఉంది టీడీపీ వాదన.

Tags:    
Advertisement

Similar News