ఎల్లో శారీ వర్సెస్ బ్లూ షర్ట్.. ఇదెక్కడి గోల
చంద్రబాబుని కలిసేందుకు షర్మిల ఎల్లో శారీలో వెళ్లడం, ఓటు వేసేందుకు వైసీపీ రంగు అయిన బ్లూ షర్ట్ లో ఎన్టీఆర్ బయటకు రావడం కాకతాళీయమా లేక ఉద్దేశపూర్వకంగానే చేశారా అనేది వారికే తెలియాలి.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ లోకి వస్తుందో ఎవరూ చెప్పలేం. తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఎల్లో శారీ, బ్లూ షర్ట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేసేందుకు బ్లూ షర్ట్ లో రావడం సంచలనంగా మారింది. మొదట్లో ఎవరూ ఆ విషయంపై ఫోకస్ చేయలేదు కానీ, ఆ తర్వాత కొంతమంది బ్లూ షర్ట్ ని హైలైట్ చేశారు. వైసీపీకి మద్దతు తెలిపేందుకే ఎన్టీఆర్ బ్లూ షర్ట్ వేసుకున్నారని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ హాట్ టాపిక్ గా మారింది.
ఎల్లో శారీ..
ఆమధ్య షర్మిల ఎల్లో శారీ కూడా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం జగన్ స్వయంగా ఈ ప్రస్తావన తేవడం విశేషం. తన తండ్రి రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుని కలిసేందుకు వెళ్లినప్పుడు ఎల్లో శారీ కట్టుకుని వెళ్లిందని, టీడీపీ రంగుకి ఆమె ప్రచారం కల్పించిందన్నట్టుగా జగన్ మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలపై షర్మిల కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఈ వాద ప్రతివాదాలతో ఎల్లో శారీ హైలైట్ గా మారింది.
అప్పుడు షర్మిల ఎల్లో శారీ, ఇప్పుడు ఎన్టీఆర్ బ్లూ షర్ట్.. ఇలా ఒక పార్టీ కుటుంబ సభ్యులు, మరో పార్టీ వారికి ప్రచారం కల్పిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. జగన్ ప్రత్యర్థి చంద్రబాబుని కలిసేందుకు షర్మిల ఎల్లో శారీలో వెళ్లడం, ఓటు వేసేందుకు వైసీపీ రంగు అయిన బ్లూ షర్ట్ లో ఎన్టీఆర్ బయటకు రావడం కాకతాళీయమా లేక ఉద్దేశపూర్వకంగానే చేశారా అనేది వారికే తెలియాలి.