తలుపు చెక్కతో వారిని, తమలపాకుతో వీరిని

జగన్ పై ఘాటు ట్వీట్ వేసిన షర్మిల, కూటమి ప్రభుత్వానికి మాత్రం సుతిమెత్తని హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement
Update:2024-07-29 11:56 IST

సిగ్గు, సిగ్గు.. అంటూ జగన్ పై ఘాటు పదాలతో ట్వీట్ వేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాల్సిందిపోయి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీపై నిందలు వేయడమేంటని నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. షర్మిల టీడీపీతో లాలూచీ పడిందనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఓ ట్వీట్ వేశారు. వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతుంటే, పంటలు నీటమునిగి రైతులు కంటతడి పెడుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు షర్మిల.


జగన్ పై ఘాటు ట్వీట్ వేసిన షర్మిల, కూటమి ప్రభుత్వానికి మాత్రం సుతిమెత్తని హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలకు రైతులు, ప్రజలు అలకల్లోలం అవుతున్నారని, ప్రభుత్వం చేస్తున్న సాయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. బీహార్ రాష్ట్రానికి వరద సహాయం కింద వేల కోట్ల రూపాయలు బీజేపీ సాయం చేసిందని, ఏపీకి మాత్రం ఎందుకు ఇవ్వలేదన్నారు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వాముల మీద ఒత్తిడి తెచ్చి వరద సాయం, మరిన్ని నిధులు తీసుకు రావాలని సీఎం చంద్రబాబుకి సూచించారు షర్మిల.

రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రతి రైతు ఎకరానికి రూ.15 వేలు ఖర్చుపెట్టారని మొత్తంగా రూ.800 కోట్లు నష్టం జరిగి ఉంటుందని షర్మిల తన ట్వీట్ లో పేర్కొన్నారు. మెడ లోతు నీళ్లలో మునిగి రైతుల కష్టాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పారని, తమకి ఉన్న నిబద్ధతలో పావు వంతయినా ప్రభుత్వానికి లేదన్నారామె. వరద పీడిత ప్రాంతాల్లో సీఎం, డిప్యూటీ సీఎం పర్యటించి, రైతులను ఆదుకునే కార్యాచరణ అమలులోకి తీసుకురావాలని చెప్పారు షర్మిల.

టీడీపీతో కుమ్మక్కయ్యారనే వార్తల నేపథ్యంలో షర్మిల ఏదో మొహమాటానికి ఈ ట్వీట్ వేసినట్టుందని అప్పుడే కామెంట్లు పడుతున్నాయి. తలుపు చెక్కతో వైసీపీని కొట్టి, తమలపాకుతో కూటమి ప్రభుత్వానికి నొప్పి తెలియకుండా కొట్టినట్టు నాటకమాడుతున్నారని అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News