నా టార్గెట్ జగన్ మాత్రమే.. షర్మిల విమర్శలు మొదలు

వివేకా హంతకులతో కలసి జగన్ తిరుగుతున్నారని, బాబాయ్ హత్యపై ఢిల్లీలో ఆయన ఎందుకు ధర్నా చేయలేదని లాజిక్ తీశారు షర్మిల.

Advertisement
Update:2024-07-22 15:16 IST

ఏపీ అసెంబ్లీలో సీట్లు లేకపోయినా, ఇటీవల ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలోనూ చెప్పుకోదగ్గ ఓట్లు రాకపోయినా.. పేరుకి కాంగ్రెస్ కూడా ప్రతిపక్షమే. ప్రతిపక్ష కాంగ్రెస్ కి టార్గెట్ ఎవరు..? కచ్చితంగా అధికారంలోని ఎన్డీఏ కూటమే. కానీ కాంగ్రెస్ టార్గెట్ మాత్రం కేవలం వైసీపీ. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. జగన్ టార్గెట్ గా ఆమె మరోసారి ఘాటు విమర్శలు చేశారు.


ఏపీలో రాజకీయ దాడులు జరుగుతున్నాయంటూ ట్వీట్ చేసిన రోజుల వ్యవధిలోనే షర్మిల మనసు మార్చుకున్నారు. వినుకొండలో జరిగింది రాజకీయ దాడి కాదు, వ్యక్తిగత దాడి అని తేల్చేశారు. ఆ నెపంతో జగన్ ఢిల్లీకి వెళ్లడమేంటని ప్రశ్నిస్తున్నారు షర్మిల. కేవలం ఉనికి కాపాడుకోడానికే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని నిందలేశారు. శాంతి భద్రతల విషయంలో అధికార కూటమిని పల్లెత్తు మాట అనని షర్మిల, ఆ దాడిపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జగన్ ని విమర్శిచడం విశేషం.

అసెంబ్లీ వదిలేసి..

జగన్ అసెంబ్లీని వదిలేసి ఢిల్లీకి వెళ్లడం షర్మిలకు ఇష్టంలేదని తెలుస్తోంది. అసెంబ్లీలో అన్ని బిల్లులు ఏకపక్షంగా పాసైపోవాలనేది జగన్ ఉద్దేశమా అని నిలదీస్తున్నారామె. ఉన్నది 11మంది, వారిని కూడా అసెంబ్లీ సమావేశాల్లో లేకుండా చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు షర్మిల. వివేకా హంతకులతో కలసి జగన్ తిరుగుతున్నారని, బాబాయ్ హత్యపై ఢిల్లీలో ఆయన ఎందుకు ధర్నా చేయలేదని లాజిక్ తీశారు. ఇక సీఎం చంద్రబాబుకి కూడా ఆమె కొన్ని సూచనలు చేశారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత చంద్రబాబుదేనన్నారు షర్మిల. 

Tags:    
Advertisement

Similar News