జగన్‌కు అఖిలేష్‌ మద్దతు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదని, జగన్‌ తన కార్యకర్తల కోసం పోరాడుతున్నారని చెప్పారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలమన్నారు. పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదన్నారు.

Advertisement
Update:2024-07-24 14:06 IST

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్‌లో నెల‌కొన్న‌ పరిస్థితుల‌పై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వ‌ద్ద‌ వైసీపీ చేపట్టిన ధ‌ర్నాకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్ మద్దతు ప్ర‌క‌టించారు. ధ‌ర్నాలో పాల్గొని ఏపీలో పరిస్థితులపై వైసీపీ చీఫ్‌ జగన్‌ను అడిగి తెలుసుకున్న అఖిలేష్‌ యాదవ్.. దాడులు, విధ్వంసాల‌పై ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు అఖిలేష్‌ యాదవ్. దీక్షకు హాజరుకాకపోతే తనకు ఇన్ని వాస్త‌వాలు తెలిసేవి కావన్నారు. అధికారంలో ఉన్నవారు సంయమనంతో ఉండాలన్నారు. బుల్డోజర్ సంస్కృతికి తాను వ్యతిరేకమన్న అఖిలేష్‌.. ఇలాంటి వైఖరితో తెలుగుదేశం ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదని, జగన్‌ తన కార్యకర్తల కోసం పోరాడుతున్నారని చెప్పారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలమన్నారు. పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదన్నారు. ఉత్తరప్రదేశ్‌లోనూ బూటకపు ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్‌ సంస్కృతి చూశామన్నారు అఖిలేష్‌.

జగన్‌ నిరసనకు అఖిలేష్‌ యాదవ్‌ మద్దతు తెలపడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జగన్‌ ఇండియా కూటమికి చేరువ అవుతున్నారన్న ప్రచారం మొదలైంది. ప్రస్తుతం అఖిలేష్‌ యాదవ్‌ ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో గణనీయంగా పుంజుకున్న ఎస్పీ.. బీజేపీకి షాక్ ఇచ్చే రీతిలో సీట్లు సాధించింది. ఇక జగన్‌ ఇప్పటివరకూ ఏ కూటమిలో లేని విషయం తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేయగా.. వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది.

Tags:    
Advertisement

Similar News