పదే పదే మోసం చేయడం చంద్రబాబుకే చెల్లింది..
చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం ఇస్తామని చెప్పినా వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని కొందరు అంటున్నారని, కానీ జగన్ పద్ధతి అది కాదన్నారు సజ్జల.
మోసపూరిత హామీలు ఇచ్చి పదే పదే ప్రజల్ని భ్రమల్లోకి నెట్టడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమంలో ఇతర నేతలతో కలసి పాల్గొన్న సజ్జల, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. హామీలు అటకెక్కించేందుకు అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చారు సజ్జల.
హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయడం సాధ్యం కాదన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంటున్నారని.. ఆర్నెళ్ల క్రితం చంద్రబాబుకి రాష్ట్ర పరిస్థితి అంచనా లేదా అని ప్రశ్నించారు సజ్జల. అలవికాని హామీలివ్వడం ఎందుకు..? ఇప్పుడు అమలు చేయలేమని చేతులెత్తేయడం ఎందుకన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం ఇచ్చినా కూడా వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని కొందరు అంటున్నారని, కానీ జగన్ పద్ధతి అది కాదన్నారు. అలవికాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయడం జగన్ కి ఇష్టం లేదన్నారు. పదే పదే అలా మోసం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని వివరించారు.
కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారని, వైఎస్ఆర్ బాటలో నడిచారని గుర్తు చేశారు సజ్జల. విద్య, వైద్య రంగాల్లో జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. ఇళ్ల ముంగిటకే జగన్ పరిపాలన తెచ్చారన్నారు. హామీలు అమలు చేయలేకపోతే చంద్రబాబుని అందరూ కలసి నిలదీద్దామన్నారు. రాష్ట్రానికి ఏ ఇబ్బంది కలిగినా వైసీపీ చూస్తూ ఊరుకోబోదన్నారు సజ్జల. ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో.. అపర భగీరథుడు వైఎస్ఆర్ అనే పుస్తకాన్ని సజ్జల ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన వృద్ధులు, మహిళలకు.. దుస్తులు, చేతి కర్రలు పంపిణీ చేశారు నేతలు.