ప్రమాణ స్వీకార తేదీ అదే.. సజ్జల క్లారిటీ
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే వైసీపీకి రెండోసారి విజయం కట్టబెడుతున్నారని చెప్పారు సజ్జల. సీఎం జగన్ పాలనకు ఏపీ ప్రజలు 100కు 200 వందల మార్కులు వేశారని అన్నారు.
రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార తేదీ జూన్-9 అంటూ మంత్రి బొత్స సత్య నారాయణ ఇది వరకే ప్రకటించారు. రాజ్య సభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కూడా ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి అదే విషయాన్ని ధృవీకరించారు. జూన్-9న ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని, అందులో ఎలాంటి మార్పు లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అప్రమత్తత అవసరం..
కౌంటింగ్ రోజు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు, కౌంటింగ్ ఏజెంట్లకు కీలక సూచనలు చేశారు సజ్జల. ఎన్నికల వేళ అల్లర్లకు తెగబడిన టీడీపీ.. కౌంటింగ్ రోజు కూడా అరాచకాలు చేసే అవకాశముందని చెప్పారాయన. ఈసీ కూడా నిస్పక్షపాతంగా వ్యవహరించడంలేదని, కొంతమంది పోలీసులు కూడా టీడీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అందుకే కౌంటింగ్ రోజు వైసీపీ నేతలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరూ ఊహించని రేంజ్ లో వైసీపీకి సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు సజ్జల.
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే వైసీపీకి రెండోసారి విజయం కట్టబెడుతున్నారని చెప్పారు సజ్జల. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదని, చివరకు ఆ పార్టీ వారికే నమ్మకం లేదని, అందుకే మేనిఫెస్టోపై పెద్దగా ప్రచారం జరగలేదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు చేసిన దుష్ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మలేదన్నారు. సీఎం జగన్ పాలనకు ఏపీ ప్రజలు 100కు 200 వందల మార్కులు వేశారని అన్నారు సజ్జల.