చంద్రబాబు అండ్ కో దిగజారుడు రాజకీయం.. - సజ్జల ఆగ్రహం
శాసనసభ, శాసన మండలిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు మద్దతు ఇచ్చిన టీడీపీ, ఇప్పుడు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తుండటం జనం గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే టీడీపీ కుట్రలు చేస్తోందనే విషయం ప్రజలకు అర్థమైందని సజ్జల తెలిపారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు అండ్ కో దిగజారుడు రాజకీయం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తప్పుడు ప్రకటనలు చేస్తూ విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తద్వారా రాష్ట్ర ప్రజల్లో ఏదో జరిగిపోతోందనే భయాందోళనలు కలిగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2019 జూలై 29న టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు మద్దతిచ్చిందని సజ్జల గుర్తుచేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో ఈ చట్టంపై భయభ్రాంతులు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వీళ్లసలు మనుషులా? పిశాచాలా? అంటూ ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన నిలదీశారు.
ఈ-స్టాంపింగ్ విధానం బాబు హయాంలోనే ప్రారంభం..
శాసనసభ, శాసన మండలిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు మద్దతు ఇచ్చిన టీడీపీ, ఇప్పుడు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తుండటం జనం గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే టీడీపీ కుట్రలు చేస్తోందనే విషయం ప్రజలకు అర్థమైందని సజ్జల తెలిపారు. ఈ-స్టాంపింగ్ విధానం చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైందని, తన హయాంలో ప్రారంభమైన ఈ-స్టాంపింగ్ విధానాన్ని చంద్రబాబు జిరాక్స్ కాపీలు అంటున్నారు. చంద్రబాబు హయాంలో తెల్గీ కుంభకోణం తర్వాత స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించిందని ఆయన గుర్తుచేశారు. ఈ-స్టాంపింగ్ పత్రాలు జిరాక్స్ కాపీలు అయితే వాటిని చంద్రబాబు చించేయగలరా అని ఆయన ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని మోదీ, అమిత్ షాతో ఎందుకు చెప్పించలేదని ఆయన నిలదీశారు. భూముల సమగ్ర సర్వే మొత్తం పూర్తి అయ్యాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుందని, ల్యాండ్ టైటిలింగ్ తర్వాత భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుందని ఆయన వెల్లడించారు.