వైసీపీలో రాజీనామాలు.. జగన్ కి పోయేదేముంది..?
జగన్ తో ఎంతమంది కలసి నడుస్తారు, ఎంతమంది ఢిల్లీ ధర్నాకు ఎగ్గొడతరానేది ఆసక్తికరం.
వైసీపీకి మద్దాలి గిరి రాజీనామా.. టీడీపీ అనుకూల మీడియా హడావిడి చేస్తోంది.
విశాఖ కార్పొరేటర్ల రాజీనామా.. వైసీపీ ఖాళీ అవుతోందంటూ వైరి వర్గం సంబరపడుతోంది.
అధికారం కోల్పోయిన తర్వాత జగన్ కి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనతో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు అవకాశం వస్తే వెళ్లిపోతారు.. అనే లెక్కలు ఆయన వేసుకునే ఉంటారు. అలా వెళ్లిపోయేవారిని బలవంతంగా తనతోనే ఉండాలని ఆయన ప్రయత్నం చేస్తారనుకోలేం. ఎందుకంటే 2014 ఓటమి తర్వాత వైసీపీని వీడి వెళ్లిన వారిలో ఏ ఒక్కరూ 2019 ఎన్నికల్లో గెలవలేదు, అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. 2019లో టీడీపీ, జనసేనను వీడి వైసీపీవైపు వచ్చిన వారికి కూడా అదే ఫలితం దక్కింది. అంటే ఇప్పుడు ఫిరాయిస్తున్న వారెవర్నీ ప్రజలు ప్రజలు నమ్మరు. ప్రతిపక్షం నుంచి అధికార పార్టీవైపు వెళ్లే ఫిరాయింపుదారుల్ని కచ్చితంగా జనం గుర్తుపెట్టుకుని మరీ ఓడించే ఆనవాయితీ ఏపీలో కొనసాగుతోంది. అందుకే జగన్ ఈ జంపింగ్ జపాంగ్ ల గురించి పెద్దగా ఆలోచించట్లేదు.
మహాధర్నాకు ఎంతమంది..?
ఈనెల 24న ఢిల్లీలో వైసీపీ మహాధర్నా చేపట్టబోతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్ సభ సభ్యులు, రాజ్య సభ సభ్యులు.. అందర్నీ ఈ ధర్నాలో భాగస్వాముల్ని చేయాలనుకుంటున్నారు పార్టీ అధినేత జగన్. అయితే అది సాధ్యమేనా అనే ప్రశ్న వినపడుతోంది. జగన్ తో ఎంతమంది కలసి నడుస్తారు, ఎంతమంది ఢిల్లీ ధర్నాకు ఎగ్గొడతరానేది ఆసక్తికరం. ధర్నాకు ఆబ్సెంట్ అయ్యేవారిపై మీడియా కూడా ఫోకస్ పెడుతుంది. అసంతృప్తులెవరైనా ఉంటారేమోనని వైరి వర్గం కూడా ఎదురు చూస్తుంటుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీలు అధికార కూటమివైపు చూస్తున్నారనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఢిల్లీ ధర్నాకు ఎంతమంది వస్తారు, ఎవరెవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీలో ఎన్నికలకు ఐదేళ్ల సమయం ఉంది. వైసీపీలోనే ఉంటే ఈ ఐదేళ్లూ ప్రతిపక్షంలోనే కూర్చోవాలి. అధికార పార్టీల్లోకి వెళ్తే.. చెడ్డపేరు వచ్చినా కాస్తో కూస్తో పలుకుబడి ఉంటుంది. ఈ పలుకుబడి కోసం, స్థానికంగా తమ మాట నెగ్గించుకోవడంకోసం వైసీపీలో కొంతమంది ప్రయత్నాలు ప్రారంభించారు. కార్పొరేటర్ల దగ్గర్నుంచి పెద్ద స్థాయి నేతల వరకు ఇందులో ఉన్నారు. ఢిల్లీ మహా ధర్నాతో ఈ లెక్కలు కొంతవరకు తేలే అవకాశముంది. అయితే ఫిరాయింపుదారులతో జగన్ పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. అదే సమయంలో వారిని చేర్చుకునే పార్టీలు పెద్దగా లాభపడే అవకాశం కూడా లేదు.