కలెక్టర్ వర్సెస్ వైసీపీ నేతలు.. ఏపీలో మరో గోల

ఉదయం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆనవాయితీగా ప్రజా ప్రతినిధులను వేదిక పైకి ఆహ్వానించాల్సి ఉంది. కానీ కలెక్టర్ దినేష్ కుమార్ ఆ పని చేయలేదు.

Advertisement
Update:2023-01-27 10:31 IST

రిపబ్లిక్ డే రోజున ప్రకాశం జిల్లాలో జరిగిన గొడవ ఇప్పుడు ముదిరి పాకాన పడుతోంది. జిల్లా కలెక్టర్ పై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికార పార్టీ నేతలు. ఈ విషయంలో సీఎం జగన్ కి కూడా వారు ఫిర్యాదు చేసే అవకాశముంది. అసలింతకీ రిపబ్లిక్ డే రోజు ఏం జరిగింది..? ప్రకాశం జిల్లాలో ఎందుకీ రచ్చ..?

ఏపీలో ఎప్పుడూ ఇలాంటి వివాదం రేగలేదు. ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. ఇండిపెండెన్స్ డే రోజున నాయకుల హడావిడి ఎక్కువగా ఉంటుంది, రిపబ్లిక్ డే రోజున సహజంగా కార్యక్రమం అంతా అధికారులదే. నాయకులు హాజరైనా జెండా ఆవిష్కరించేది అధికారులే కాబట్టి.. సహజంగా నేతలు కాస్త అంటీముట్టనట్టుగానే ఉంటారు. పైగా అధికారులు అవార్డుల కార్యక్రమం బిజీలో ఉంటారు. ప్రకాశం జిల్లాలో కూడా ఇదే జరిగింది. ఉదయం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆనవాయితీగా ప్రజా ప్రతినిధులను వేదిక పైకి ఆహ్వానించాల్సి ఉంది. కానీ కలెక్టర్ దినేష్ కుమార్ ఆ పని చేయలేదు. షెడ్యూల్ లో లేదో, లేక హడావిడిగా కార్యక్రమం ముగించాలన్న తొందరలో నాయకులను పిలవలేదో తెలియదు కానీ.. వైసీపీ నేతలు నొచ్చుకున్నారు.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.. అందరూ అలిగారు, కనీసం టిఫిన్ కూడా చేయకుండా కార్యక్రమం నుంచి వెనుదిరిగారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తమను అవమానించారంటూ ఆ తర్వాత సన్నిహితుల దగ్గర వాపోయారు. ఆ తర్వాత మినీ స్టేడియంలో జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా ప్రజా ప్రతినిధులు రాలేదు. దీంతో కలెక్టర్ ఏకంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడం విశేషం. ఆ తర్వాత హై టీ కార్యక్రమం ఏర్పాటు చేసినా ప్రజా ప్రతినిధులు డుమ్మా కొట్టారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్లు చేసినా ఎవరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వారి తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

కలెక్టర్ పై ఫిర్యాదు..

జిల్లాలో కలెక్టర్ వర్సెస్ ప్రజా ప్రతినిధుల వ్యవహారం చర్చకు దారి తీసింది. ఇలాంటి కార్యక్రమంలో పట్టింపులకు పోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రిపబ్లిక్ డే కి పిలిచి తమని అవమానించారంటూ ప్రజా ప్రతినిధులు కలెక్టర్ దినేష్ కుమార్ పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారట. 

Tags:    
Advertisement

Similar News