రాజకీయంగా నా మద్దతు ఆయ‌న‌కే.. రేణు దేశాయ్ సంచలన ప్రకటన

పవన్ మూడు పెళ్లిళ్లపై దయచేసి చర్చ ఆపాలని ఆమె కోరింది. అంతేకాదు రాజకీయంగా నా మద్దతు పవన్ కళ్యాణ్ కే అని ప్రకటించి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది.

Advertisement
Update:2023-08-10 17:44 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై దయచేసి చర్చ ఆపాలని ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడంపై వైసీపీ నాయకులు ఇటీవల పదేపదే విమర్శలు చేస్తుండగా.. రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచారు. వైసీపీ ఓటమి కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని ఆయన పదేపదే కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా పవన్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్లు చేస్తున్నారు. తన వ్యక్తిగత జీవితం జోలికి వస్తే చెప్పుతో కొడతానని పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటికీ.. ఈ టాపిక్ ను వైసీపీ నాయకులు వదలడం లేదు. చివరికి ముఖ్యమంత్రి జగన్ కూడా పవన్ నిత్య పెళ్లికొడుకు అంటూ తరచూ విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ కు ఎవరూ ఊహించని విధంగా ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ నుంచి మద్దతు లభించింది. పవన్ మూడు పెళ్లిళ్లపై దయచేసి చర్చ ఆపాలని ఆమె కోరింది. అంతేకాదు రాజకీయంగా నా మద్దతు పవన్ కళ్యాణ్ కే అని ప్రకటించి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు.

అందులో ఆమె మాట్లాడుతూ..' పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాజకీయంగా ఆయనకు నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నా. నేను జీవితంలో ముందుకు సాగిపోతున్నాను. పవన్ కళ్యాణ్ సమాజం కోసం మంచి చేయాలనుకునే వ్యక్తి. నాకు తెలిసినంతవరకు ఆయన అరుదైన వ్యక్తి. మనీ మైండెడ్ కానే కాదు. డబ్బుపై ఎటువంటి ఆసక్తి లేదు. సమాజం, పేదల సంక్షేమం కోసం పని చేయాలనుకునే స్వభావం ఆయనది. అందుకే ఆయనకు నేనెప్పుడూ రాజకీయంగా మద్దతు ఇస్తుంటా.

సినిమాల్లో పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫుల్ యాక్టర్. ప్రజలకు సేవ చేయడం కోసమే ఆయన కుటుంబాన్ని పక్కనపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. అందరూ రాజకీయంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవను గుర్తించాలి. దయచేసి ఒకసారి ఆయనకు అవకాశం ఇవ్వండి. కొందరు ప్రతిసారి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. దయచేసి అలా మాట్లాడవద్దు.

పవన్ మూడు పెళ్లిళ్లపై దయచేసి చర్చ ఆపండి. నా పిల్లలు, మిగిలిన ఇద్దరు పిల్లలను ఈ వ్యవహారంలోకి లాగవద్దు. ఎందుకంటే వారు ఇంకా చిన్న పిల్లలు. బ్రో సినిమాలో కొన్ని సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయని నాకు తెలిసింది. ఆ వివాదం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. అయితే ఇటీవల కొంతమంది పవన్ మూడు పెళ్లిళ్లపై ఓ సినిమా, వెబ్ సిరీస్ చేస్తామని ప్రకటించడం వరకు నాకు తెలుసు. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో విడుదల చేస్తున్నాను. దయచేసి రాజకీయ వివాదాల్లోకి పిల్లలను లాగవద్దు' అని రేణు దేశాయ్ ఆ వీడియోలో పేర్కొంది.

ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఏ రాజకీయ నాయకుడిపై విమర్శలు చేసినా అందుకు కౌంటర్ గా వచ్చే విమర్శలు పవన్ మూడు పెళ్లిళ్ల గురించే ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ పవన్ కు మద్దతుగా చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.

Tags:    
Advertisement

Similar News