దేవాదాయ శాఖ నుంచి 90 శాతం గుడుల తొలగింపు? బిల్లు సిద్ధం చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం!

దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే ఆయా దేవాలయాల వారసులు, ట్రస్టీలను వెతికే పనిలో పడ్డారు. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న గుడులు, సంబంధిత ఆస్తులు ట్రస్టీల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

Advertisement
Update:2023-06-27 09:23 IST

ఏపీలోని పలు దేవాలయాలను ప్రభుత్వం తమ పరిధి నుంచి మినహాయించడానికి రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉండి.. ఏడాదికి రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలను ట్రస్టీలకు అప్పగించాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్ పెట్టాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర ఎండోమెంట్ యాక్ట్‌కు సవరణ జరిగితే రాష్ట్రంలోని 90 శాతం గుడులు దేవాదాయ శాఖ నుంచి ట్రస్టీల చేతుల్లోకి వెళ్లనున్నాయి.

దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే ఆయా దేవాలయాల లీగల్ వారసులు, ట్రస్టీలను వెతికే పనిలో పడ్డారు. రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న గుడులు, సంబంధిత ఆస్తులు ట్రస్టీల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఆర్ఎస్ఎస్ సహా పలు హిందూ ధార్మిక సంస్థలు దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని కోరుతున్నాయి. దీంతో మొదటి దశలో రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలను తప్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఏపీలోని దేవాదాయ శాఖ పరిధిలో 22,678 గుడులు ఉన్నాయి. దీనికి సంబంధించిన నిర్వహణను ఈవోల ద్వారా ప్రభుత్వమే చూస్తోంది. రాష్ట్రంలోని పెద్ద దేవాలయాల ట్రస్ట్ బోర్డులో పదవుల కోసం అధికార పార్టీ నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో చిన్న దేవాలయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. వేలాది దేవాలయాలకు ఆదాయం పెద్దగా లేకపోవడంతో.. దేవాదాయ శాఖ కూడా అరకొర నిధులే కేటాయిస్తోంది.

హుండీల ఆదాయం తక్కువ రావడం, ఆయా దేవాలయాల ఆస్తులను సరిగా నిర్వహించపోవడంతో చాలా గుడులు నిరాదరణకు గురవుతున్నాయి. అదే స్థానిక ట్రస్టీలకే గుడులను బదిలీ చేయడం ద్వారా వాటి నిర్వహణ మెరుగు పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పైగా ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదని ఎన్నాళ్ల నుంచో హిందూ ధార్మిక సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ఎండోమెంట్ చట్ట సవరణ జరిగితే.. ఇకపై 90 శాతం గుడులు ట్రస్టీల ఆధ్వర్యంలోనే ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఆయా గుడులకు సంబంధించిన ఆస్తుల రక్షణ, ఆదాయ వ్యయాల నిర్వహణ మొత్తం ట్రస్ట్ బోర్డులు చూసుకుంటాయి. దేవాలయ ఆస్తులను అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకునే బాధ్యత కూడా ట్రస్టీలపై ఉంటుంది. ఇక పూజారులకు ప్రతీ నెల రూ. 10వేల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇస్తుంది. వారికి ఎలాంటి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఉండబోవని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News