మైత్రి మూవీస్ లో పెట్టుబడులు..? బాలినేని రియాక్షన్

మైత్రి మూవీస్ లో పెట్టుబడులు ఇక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే పెడుతున్నారో అందరికీ తెలుసన్నారు బాలినేని. ప్రజల్లో ఆదరణ ఉందని తనపై బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Update:2023-04-23 16:45 IST

మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో తన పెట్టుబడులున్నాయంటూ జనసేన చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. ఆ సంస్థలో తనకు కానీ, తన వియ్యంకుడికి కానీ ఎలాంటి పెట్టుబడులు లేవన్నారు. ఒకవేళ ఉన్నాయని నిరూపిస్తే తన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తానని, రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఒంగోలులో వీర సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తాను పర్మిషన్ ఇప్పించానని, అంత మాత్రాన తనకు ఆ చిత్ర నిర్మాణ సంస్థకు సంబంధం ఉన్నట్టా అని ప్రశ్నించారు.

ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్, వైజాగ్ లోని ఆ సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మైత్రి సంస్థలో మాజీ మంత్రి బాలినేనికి కూడా భాగస్వామ్యం ఉందంటూ వైజాగ్ జనసేన నేతలు ఆరోపించారు. ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. వైజాగ్ లో బాలినేని బంధువులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాలినేని వెంటనే స్పందించాల్సి వచ్చింది.

పవన్ వివరణ ఇవ్వాలి..

మైత్రి మూవీస్ లో పెట్టుబడులు ఇక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే పెడుతున్నారో అందరికీ తెలుసన్నారు బాలినేని. ప్రజల్లో ఆదరణ ఉందని తనపై బురద చల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో కచ్చితంగా పవన్ కల్యాణ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంబంధం లేకుండా తనపై అభియోగాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు బాలినేని.

Tags:    
Advertisement

Similar News