ఎర్రమట్టి పాపం ఎవరిది..?

ఎర్ర మట్టి దిబ్బల తవ్వకం వెనక బులుగు ముఠా ఉందని, విచారణ మొదలైందని, ఎవర్నీ వదిలిపెట్టేది లేదని టీడీపీ అంటోంది.

Advertisement
Update: 2024-07-18 03:51 GMT

విశాఖలో ఎర్రమట్టి దిబ్బల్ని తరలించుకుపోతున్నారని, మట్టి మాఫియా పెట్రేగిపోయిందనే వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ పాపం ఎవరిది..? ఐదేళ్లు పాలించిన గత ప్రభుత్వానిదా, 35 రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వానిదా..? తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎర్రమట్టి దిబ్బల వద్ద సెల్ఫీ దిగి ప్రభుత్వంపై ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టారు. విశాఖలోని భౌగోళక వారసత్వ సంపద పరిస్థితి ఇదీ అంటూ ఓ ట్వీట్ వేశారు. కొత్త ప్రభుత్వ పెద్దల సహకారం, స్థానిక నాయకుల మద్దతుతోనే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలో విశాఖ భవిష్యత్ ఎలా ఉండబోతుందనడానికి ఇదే తార్కాణం అన్నారు అమర్నాథ్.

టీడీపీ కౌంటర్లు..

గుడివాడ అమర్నాథ్ కి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. "మిస్టర్ మాజీ గుడ్డు... అది తమరి ముఠా పొదిగిన గుడ్డే.. మర్చిపోయారా?" అంటూ టీడీపీ ట్విట్టర్ అకౌంట్ నుంచి వెటకారంగా సమాధానం వచ్చింది. విశాఖపై అన్ని వైపుల నుంచి పగ తీర్చుకున్న సైకో ముఠా ఐదేళ్ళ పాటు ఎర్రమట్టి దిబ్బలను తవ్వేసిందని, చివరికి చెట్లు కూడా నరికేసి, యథేచ్చగా తవ్వుకు పోయారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎర్ర మట్టి దిబ్బల తవ్వకం వెనక బులుగు ముఠా ఉందని, విచారణ మొదలైందని, ఎవర్నీ వదిలిపెట్టేది లేదని అంటోంది. ఎర్రమట్టి దిబ్బల్ని తవ్వేస్తున్నారంటూ గతంలో వచ్చిన కథనాలను ఆ ట్వీట్ కి జోడించింది టీడీపీ.


తప్పెవరిది..?

ఎర్రమట్టి దిబ్బల్ని ఎవరు తవ్వినా అది క్షమించరాని నేరం. ఎర్రమట్టి దిబ్బలు సహజవనరులే కాదు, అంతకు మించి అవి విశాఖకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టే వారసత్వ సంపద అనేది అందరికీ తెలిసిన విషయమే. గతంలో తెలుగు సినిమా పాటల్లో ఎర్రమట్టి దిబ్బలు కనిపించేవి. ఇప్పుడు అక్కడ సినిమా సందడి కూడా లేదు. పర్యాటకుల తాకిడి కూడా అంతంతమాత్రమే. దీంతో వాటిల్ని గత చరిత్రగా మార్చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అక్రమార్కులు. తప్పులెన్నడం మానేసి, ఇప్పటికైనా వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విశాఖ వాసులు.

Tags:    
Advertisement

Similar News