ఆ తేడా తెలియని చంద్రబాబును వదిలేసి, జగన్‌పై రామోజీ ఏడుపులు

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయ భూములను, చారిటబుల్‌ భూములను, ఇనాం భూములను, గ్రామ సర్వీస్‌ ఇనాం భూములను ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో విడదీసింది.

Advertisement
Update:2024-02-11 13:29 IST

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోసం రామోజీరావు మీడియా సిద్ధాంతాల‌ను, జ‌ర్నలిజం విలువ‌ల‌ను సైతం ప‌క్క‌కునెట్టి వార్త‌లు వండివారుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తప్పుడు రాతలు రాయిస్తున్నారు. అటువంటిదే మరో కథనం.. ‘కుంభకర్ణుడి వారసులు.. ఇనాం భూములకు సైంధవులు’. చంద్రబాబు తన ప్రభుత్వం హయాంలో చేసిన నిర్వాకాన్ని దాచి పెట్టి జగన్‌ మీద బురద చల్లారు.

ఇనాం భూముల సమస్యను పరిష్కరించి, జగన్‌ ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూములపై నిషేధం తొలగించింది. దేవాలయ, గ్రామ సర్వీస్‌ ఇనాం భూములకు తేడా తెలియకుండా 2019 ఎన్నికలకు ముందు హడావిడిగా చంద్రబాబు ఆర్డినెన్స్‌ జారీ చేశారు. గ్రామ సర్వీస్‌ భూముల సమస్యను పరిష్కరించలేక తన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేతులెత్తేశారు. ఓట్ల కోసం ఎన్నికలకు రెండు నెలల ముందు పనికిరాని ఆర్డినెన్స్‌ను జారీచేశారు.

కులవృత్తులవారికి కేటాయించిన ఇనాం భూముల రైత్వారీ పట్టాలు కూడా గతంలో పొరపాటున రద్దయ్యాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ సమస్యను గాలికి వదిలేశారు. 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు ఆ సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఆర్డినెన్స్‌ తెచ్చి చేతులు దులుపుకున్నారు.

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయ భూములను, చారిటబుల్‌ భూములను, ఇనాం భూములను, గ్రామ సర్వీస్‌ ఇనాం భూములను ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో విడదీసింది. ప్రస్తుత చట్టాల మేరకు గ్రామ సర్వీస్‌ ఇనాం భూములకు, గతంలో మంజూరు చేసిన రైత్వారీ పట్టాలకు జీవో ఎంఎస్‌ నెంబర్‌ 310 ద్వారా చట్టబద్ధత కల్పించారు. దేవాదాయ భూములకు, గ్రామ సర్వీస్‌ భూములకు మధ్య తేడాను గుర్తించడంలో గత చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. ఆ తేడాను గుర్తించి ఆచరణాత్మకంగా దాన్ని అమలు చేసింది జగన్‌ ప్రభుత్వం.

జగన్‌ ప్రభుత్వం చేపట్టిన విధానం వల్ల 1.79 లక్షల సర్వీస్‌ ఇనాం భూములపై ఆంక్షలు తొలగాయి. దానికితోడు దేవాదాయ, ఇనిస్టిట్యూషనల్‌, చారిటబుల్‌, గ్రామ సర్వీస్‌ ఇనాం భూముల మధ్య ఉన్న తేడాను జగన్‌ ప్రభుత్వం స్పష్టంగా వివరించింది. దాని వల్ల ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న వివాదాలు పరిష్కారమయ్యాయి. ఇనాం భూములకు సంబంధించి మాత్రమే కాకుండా చుక్కల భూములు, షరతులు గల పట్టా భూములు, ఇతర పలు విధాలైన భూముల సమస్యను జగన్‌ ప్రభుత్వం పరిష్కరించింది. జగన్‌ ప్రభుత్వం 3 లక్షల ఎకరాలకు పైగా భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి రైతులకు ప్రయోజనం చేకూర్చింది. అసైన్డ్‌ భూములకు యాజమాన్యం హక్కులు కల్పించడంతో 27 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులు ప్రయోజనం పొందారు.

వాస్తవాలు ఇలా ఉంటే రామోజీరావు ఈనాడు మీడియా మాత్రం రంధ్రాన్వేషణ చేసి వాస్తవాలను పక్కన పెట్టేసి అసత్యాలను ప్రచారం చేయడానికి నడుం బిగించింది.

Tags:    
Advertisement

Similar News