సీసీ సీబీఎన్.. చంద్రబాబుకి వర్మ బర్త్ డే గిఫ్ట్
పుట్టినరోజు కూడా చంద్రబాబు ఏడుపుని తన పాటలో వినిపించారు వర్మ. వైసీపీ సోషల్ మీడియాలో ఈ పాటను విపరీతంగా షేర్ చేస్తున్నారు.
నారా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే అందరూ కేవలం శుభాకాంక్షలు చెప్పి సరిపెట్టుకున్నారు కానీ, దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మాత్రం ఏకంగా ఆయనపై ఓ పాట రెడీ చేశారు. ఆ పాటను సోషల్ మీడియాలో వదిలి ఆయనకిదే తన బర్త్ డే గిఫ్ట్ అని చెప్పారు. సీసీ సీబీఎన్ అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.
చంద్రబాబుపై వైసీపీ నేతలకంటే ఎక్కువగా సెటైర్లు వేసే రామ్ గోపాల్ వర్మ బర్త్ డే విషెస్ చెబుతూ పాట రిలీజ్ చేశాడంటేనే అది ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. ఆ అంచనాలను నిజం చేస్తూ వర్మ సెటైరిక్ గా ఆ సాంగ్ రిలీజ్ చేశారు. సిక్కో సైకో అంటూ చంద్రబాబుని కామెంట్ చేశారు. సిక్కో అనే పదానికి ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ఫలానా అర్థం ఉందని చెబుతూ చంద్రబాబుని సిక్కో సైకో అంటూ పాటను మొదలు పెట్టారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..
సిక్కో సైకో సాంగ్ ను ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపొందించినట్లు ట్వీట్ లో పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ. సంగీతం, గానం, గీత రచన.. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనంటున్నారు వర్మ. టీడీపీ నుంచి విమర్శలు వచ్చినా, తనకేమీ తెలియదని, అంతా AI పనేనని చెప్పేస్తారనమాట. కాంగ్రెస్ లో చంద్రబాబు రాజకీయం ప్రారంభమవడం, ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరకు రావడం.. ఇలా అన్ని విషయాలను ప్రస్తావిస్తూ పుట్టినరోజు కూడా చంద్రబాబు ఏడుపుని తన పాటలో వినిపించారు వర్మ. వైసీపీ సోషల్ మీడియాలో ఈ పాటను విపరీతంగా షేర్ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాత్రం పేటీఎం వ్యవహారం అంటూ కౌంటర్లు పడుతున్నాయి.