అనవసరంగా ఆడిపోసుకున్నారు.. ఆ జైలు సూపరింటెండెంట్ భార్య అనారోగ్యంతో చనిపోయింది
నిజానికి రాహుల్ భార్య క్యాన్సర్‌తో చివరి దశలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో అత్యవసర పరిస్థితుల్లోనే ఆయన సెలవు అడిగితే సెలవు మంజూరు చేశామని జైళ్లశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే చెప్పారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో నిందితుడిగా చంద్రబాబును రిమాండ్‌లో ఉంచిన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌స్పాట్. చంద్రబాబు కుటుంబం అంతా రాజమహేంద్రవరంలోనే మకాం వేయడం, బాబును పరామర్శించడానికి పవన్ కల్యాణ్, బాలకృష్ణ లాంటి ప్రముఖులు రావడంతో ఇప్పటికే ఆ జైలు వార్తల్లోకి ఎక్కింది. అయితే జైలు సూపరింటెండెంట్ రాహుల్ రెండు రోజుల క్రితం భార్య అనారోగ్యం రీత్యా సెలవుపెట్టారు. దీనిపై టీడీపీ విపరీతంగా ఆరోపించింది. ఆయన్ను కావాలనే పక్కనపెట్టారని విమర్శించింది.
క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూత
నిజానికి రాహుల్ భార్య క్యాన్సర్‌తో చివరి దశలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో అత్యవసర పరిస్థితుల్లోనే ఆయన సెలవు అడిగితే సెలవు మంజూరు చేశామని జైళ్లశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే చెప్పారు. అయినా టీడీపీ నేతలు కావాలనే రాహుల్‌ను సెలవులో పంపారని ఆరోపణలు చేశారు. అయితే గురువారం ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయారు. భార్యకు అంత తీవ్రమైన అనారోగ్యంతో అధికారి సెలవు పెడితే అనవసంగా ఆడిపోసుకున్నారని టీడీపీ లీడర్లమీద విమర్శలు వస్తున్నాయి.
ప్రతి చిన్న విషయంపైనా ఆరోపణలే..
చంద్రబాబును జైల్లో ఉంచినప్పటి నుంచి ప్రతి చిన్న విషయంపైనా ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. స్నానానికి వేడి నీళ్లు ఇవ్వడం లేదని, ఏసీ లేదని, ప్లాస్టిక్ కుర్చీలే వేశారని, సింగిల్ కాట్ బెడ్డే ఉందని దీర్ఘాలు తీస్తున్నారు. ఇవన్నీ ఉంటే అది జైలు ఎందుకు అవుతుందని, ఆయన వయసు రీత్యా అన్ని ఏర్పాట్లు జైలు అధికారులు చేశారని వైసీపీ మంత్రులు చెబుతున్నారు.