పురంద్రీశ్వరి ఎంపిక వెనక ఇంత చర్చ జరిగిందా..!

పురంద్రీశ్వరి ఎంపిక చాలా వ్యూహాత్మకంగా జరిగింది. ఏపీలో వరుసగా కాపు సామాజిక వర్గానికి అవకాశమిస్తున్న బీజేపీ ఇప్పుడు కమ్మవారికి ఛాన్స్ ఇచ్చింది.

Advertisement
Update:2023-07-05 20:14 IST

పురంద్రీశ్వరి ఎంపిక వెనక ఇంత చర్చ జరిగిందా..!

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంద్రీశ్వరి నియామకం వెనక చాలా పెద్ద కసరత్తే జరిగినట్టు తెలుస్తోంది. ఏపీలో బీజేపీ బలపడాలనే వ్యూహంతోపాటు, టీడీపీకి చెక్ పెట్టాలనే కసి కూడా ఆ నియామకంతో స్పష్టమవుతోంది.

సోము నుంచి పురంద్రీశ్వరి వరకు..

సోము వీర్రాజుని తొలగించడంపై ఎవరికీ పెద్దగా అనుమానం లేదు కానీ, ఆ తర్వాత ఆ స్థానం ఎవరికి దక్కుతుందనే విషయంలో మాత్రం ఊహాగానాలు చాలానే వినిపించాయి. ముందుగా సత్యకుమార్ పేరు తెరపైకి వచ్చింది. సత్యకుమార్ కి వెంకయ్య నాయుడు ఆశీస్సులున్నాయి, అదే ఆయనకు మైనస్ గా మారింది. గతంలో వెంకయ్య నాయుడు ఫామ్ లో ఉన్నప్పుడు బీజేపీ పూర్తిగా టీడీపీకి తోకపార్టీగా ఉంది. కేవలం టీడీపీ కోసమే ఏపీలో బీజేపీకి ఎదుగుదల లేకుండా చేశారు వెంకయ్య నాయుడు. ఆయన శిష్యుడు సత్యకుమార్ బీజేపీ పగ్గాలు చేపట్టినా పరిస్థితి అంతే దారుణంగా ఉంటుంది. ఆ విషయం తెలిసే సత్యకుమార్ ని పక్కనపెట్టారు. ఆ తర్వాత సుజనా చౌదరి, సీఎం రమేష్ పేర్లు తెరపైకి వచ్చాయి.

వీర్రాజు స్థానంలో సుజనా చౌదరి, లేదా సీఎం రమేష్ ని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేసేందుకు చంద్రబాబు తెరవెనక మంత్రాంగం నడిపించారు. కానీ బీజేపీ అధిష్టానానికి వారిపై నమ్మకం లేదు. సుజనా చౌదరి లేదా సీఎం రమేష్.. ఇద్దరూ బీజేపీ ముసుగులో ఉన్న టీడీపీ సానుభూతిపరులు. వారికి అధ్యక్ష పదవి ఇస్తే ఏపీలో బీజేపీ, టీడీపీకి మళ్లీ తోకపార్టీగా మారడం ఖాయం. దీంతో వారిద్దరి పేర్లు కూడా వెనక్కి వెళ్లిపోయాయి.

ఫైనల్ గా పురంద్రీశ్వరి..

పురంద్రీశ్వరి ఎంపిక చాలా వ్యూహాత్మకంగా జరిగింది. ఏపీలో వరుసగా కాపు సామాజిక వర్గానికి అవకాశమిస్తున్న బీజేపీ ఇప్పుడు కమ్మవారికి ఛాన్స్ ఇచ్చింది. 2024లో ఏపీలో వైసీపీదే అధికారం అని బీజేపీ కూడా బలంగా నమ్ముతోంది. సో వారి టార్గెట్ 2024 కాదు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు ఈసారి టీడీపీ పూర్తిగా మట్టికరవడం ఖాయం. ఆ పరాజయం తర్వాత చంద్రబాబు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం దాదాపుగా కష్టమే. 2029 నాటికి వయోభారంతో బాబు హవా తగ్గిపోతుంది. లోకేష్ నాయకత్వం ఏపాటిదో పార్టీ నేతలకు పూర్తిగా అర్థమవుతుంది. సో.. 2029నాటికి టీడీపీలోని కమ్మ సామాజిక వర్గం నేతలకు ప్రత్యామ్నాయం కావాలి. అందుకే పురంద్రీశ్వరిని బీజేపీ హైలెట్ చేస్తోంది. సామాజిక వర్గంతోపాటు ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకు ఏపీలో క్రేజ్ ఉంది. ఆమె నాయకత్వంలో పనిచేయడానికి ఎవరికీ భేషజాలు ఉండకపోవచ్చు. సో టీడీపీకి దూరమయ్యే కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా దగ్గర చేసుకోడానికి బీజేపీ ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టిందనమాట. ఆ విధంగా వైసీపీని ఎదుర్కొనే ఆలోచన చేస్తోంది.

కాపులు అవసరం లేదా..?

ఏపీలోని రెండు ప్రధాన సామాజిక వర్గాలకు వైసీపీ, టీడీపీ ప్రాతినిధ్యం వహించడంతో ఇప్పటి వరకూ బీజేపీ కాపు వర్గంపై ఆశలు పెట్టుకుంది. కానీ పవన్ కల్యాణ్ రాకతో ఆ అంచనాలు తప్పాయి. బీజేపీని మించి పవన్ కాపులకు దగ్గరయ్యారు. అందుకే బీజేపీ, ఏపీలో పురంద్రీశ్వరిని తెరపైకి తెచ్చింది. 2029 టార్గెట్ గా పావులు కదుపుతోంది. 2024లో ఏపీ వైసీపీదే, 2029లో టీడీపీ లేని ఏపీలో వైసీపీతో తలపడేది బీజేపీయే. ఇదే కమలదళం మాస్టర్ ప్లాన్ అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Tags:    
Advertisement

Similar News