కుప్పంలో షాక్.. పుంగనూరులో సవాల్
లైమ్ లైట్లో లేనివారందరికీ కండువాలు కప్పేసి, ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు. పుంగనూరు సంగతి తర్వాత ముందు కుప్పంలో జాగ్రత్త అంటూ బాబుపై సెటైర్లు పేలుస్తున్నారు వైసీపీ నేతలు.
కుప్పంలో చంద్రబాబుకి ఈసారి విజయం అంత ఈజీగా కాదని తేలిపోయింది. ప్రత్యర్థి వర్గం మరింత హుషారు కావడంతో టీడీపీ అధినేత డైలమాలో పడ్డారు. నెలలో వారం రోజులు కుప్పంలోనే మకాం వేస్తున్నారు. ఈ దశలో ఇప్పుడాయన పుంగనూరుపై దృష్టిసారించారని టీడీపీ కోతలు కోస్తోంది. అంతే కాదు, మంత్రి పెద్దిరెడ్డిని ఓడించేందుకు టీడీపీ వ్యూహ రచన చేసిందని, ఈసారి చంద్రబాబు వ్యూహంతో పెద్దిరెడ్డి ఓడిపోవడం ఖాయమని అంటోంది.
ఇంతకీ పుంగనూరు కథేంటి..?
పుంగనూరు విషయంలో చంద్రబాబు అండ్ టీమ్ రెచ్చిపోడానికి ప్రధాన కారణం ఆ నియోజకవర్గంలో చేరికలు. గతంలో పుంగనూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకట రమణరాజు ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఆయన ఇప్పుడు తిరిగి టీడీపీ గూటికి వచ్చేశారు. కండువా కప్పి చంద్రబాబు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో పెద్దిరెడ్డికి పెద్ద షాక్ తగిలిందని, పుంగనూరులో ఆయన ఓటమి ఖాయమని ఎల్లో మీడియా రెచ్చిపోతోంది.
పుంగనూరులో పెద్దిరెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యే. అందులోనూ గత రెండు ఎన్నికల్లో ఆయనకి లక్షకి పైగా ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓట్లను కలిపి లెక్కించినా ఆయన దగ్గర్లోకి కూడా రాలేదు. ఇప్పుడు కూటమిగా వచ్చినా కూడా పెద్దిరెడ్డికి వచ్చిన నష్టమేమీ లేదు. ఆయన ప్రత్యర్థిగా టీడీపీ చల్లాబాబుని రంగంలోకి దింపింది. కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తామంటూ పెద్దిరెడ్డి సవాల్ చేయడంతో.. బాబు కూడా పుంగనూరులో ఏదో జరిగిపోతోందనే భ్రమ కల్పించాలనుకుంటున్నారు. లైమ్ లైట్లో లేనివారందరికీ కండువాలు కప్పేసి, ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. పుంగనూరు సంగతి తర్వాత ముందు కుప్పంలో జాగ్రత్త అంటూ బాబుపై సెటైర్లు పేలుస్తున్నారు వైసీపీ నేతలు.