నవంబర్ 11న విశాఖకు మోదీ.. రాజధాని సెగ తగులుతుందా..?

నవంబర్ 11న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఫిక్స్ అయింది. రూ.400 కోట్లతో చేపట్టబోతున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు.

Advertisement
Update:2022-10-26 11:05 IST

విశాఖ రాజధాని కాదన్న వారిని ఊరికే వదలబోమంటూ విశాఖ గర్జనలో తీర్మానం చేశారు. విశాఖ కేంద్రంగా అధికార వైసీపీ, నాన్ పొలిటికల్ జేఏసీతో కలసి గర్జించింది. ఆ గర్జనకు అమరావతి రైతులు కూడా వెనక్కు తగ్గారని అధికార పార్టీ అంటోంది, పవన్ కి కూడా నిరసన సెగ బాగానే తగిలిందని చెబుతున్నారు. మరి నవంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వస్తున్నారు. అప్పుడేం జరుగుతుందో చూడాలి.

బీజేపీ తాము మూడు రాజధానులకు వ్యతిరేకం అని చెప్పకపోయినా, ప్రస్తుతానికి తమ మద్దతు అమరావతికేనంటోంది. మూడు రాజధానుల పేరుతో ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు. అంటే రాజధాని విషయంలో వైసీపీ, బీజేపీవి వేర్వేరు దారులన్నమాట. మరిప్పుడు విశాఖకు ప్రధాని వస్తున్న క్రమంలో ఆయనకు కూడా రాజధాని సెగ తగులుతుందా, మోదీతో జై విశాఖ అనిపించగలరా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం.

నవంబర్ 11న విశాఖలో ప్రధాని పర్యటన ఫిక్స్ అయింది. రూ.400 కోట్లతో చేపట్టబోతున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టబోతున్న మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు, అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం వైజాగ్‌ లో బహిరంగ సభ జరుగుతుంది. సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ప్రధాని మోదీ పర్యటన విషయంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ఇటు వైసీపీ మాత్రం రాష్ట్ర బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా, మోదీ పర్యటనకు దూరంగా జరిగే సాహసం చేయలేదు. అలాగని రాజధాని విషయంలో ప్రధానితో ప్రకటన చేయించే ధైర్యం కూడా వైసీపీ ప్రభుత్వానికి లేదనే చెప్పాలి. మొత్తమ్మీద గర్జనతో విశాఖ వేడెక్కాక ప్రధాని మోదీ పర్యటన ఖరారు కావడం మాత్రం విశేషం. అటు విశాఖ ఉక్కు, రైల్వేజోన్ విషయాల్లో కూడా కేంద్రంపై తీవ్ర విమర్శలున్నాయి. కానీ ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని ధిక్కరించి మాట్లాడలేకపోవడమే ఇక్కడ విశేషం.

Tags:    
Advertisement

Similar News