వైసీపీకి ప్రశాంత్ కిషోర్.. టీడీపీకి వేణు స్వామి
పీకే అంచనాలు తప్పుతాయని వైసీపీ లెక్కలేసుకుంటోంది. వైసీపీ గరించి వేణు స్వామి చెప్పిన జాతకం రివర్స్ అవుతుందని టీడీపీ సంబరపడుతోంది.
2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. 2024 ఎన్నికల నాటికి ఆ పార్టీకి మంచి ట్రోలింగ్ సబ్జెక్ట్ గా మారారు. ఏపీతోపాటు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఢంకా భజాయిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. అయితే పీకే అంచనాలు తలకిందులవడం ఖాయమని, ఏపీలో కూటమి చిత్తు చిత్తుగా ఓడిపోతుందని అంటున్నారు. సాక్షాత్తూ సీఎం జగనన్ కూడా పీకేని టార్గెట్ చేసి మాట్లాడటం విశేషం. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిళ్లు కూడా పీకే అంచనాలను హైలైట్ చేస్తూ టీడీపీ ఓటమిని ఖాయం చేస్తున్నాయి.
పీకేవన్నీ తప్పుడు అంచనాలేనని, గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో పీకే చెప్పిన వాటికి పూర్తి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని అంటున్నారు. కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో పీకే అడ్డంగా దొరికిపోయారని, చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని చిలకజోస్యం చెబుతున్నారని అంటున్నారు. పీకే టీడీపీ కూటమి గెలుస్తుందని అన్నారు కాబట్టి, కచ్చితంగా అదిజరగదని, అంటే వైసీపీ గెలుపు ఖాయమని చెబుతున్నారు ఆ పార్టీ అభిమానులు.
టీడీపీకి వేణు స్వామి..
ఇక టీడీపీ, వేణు స్వామి జాతకాన్ని నమ్ముకుంది. ఇటీవల ఎన్నికల ఫలితాలు, సినీ తారల వ్యక్తిగత జీవితాలు, సినిమా రిజల్ట్, క్రికెట్ మ్యాచ్ ల ఫలితాలను అంచనా వేస్తూ వేణు స్వామి టాక్ ఆఫ్ తెలుగు స్టేట్స్ గా మారారు. తన అంచనాని నిజం అని భ్రమ కలిగేలా సాధికారికంగా చెప్పడం వేణు స్వామికి అలవాటు. అలాంటి వేణు స్వామి ఏపీలో వైసీపీ గెలుస్తుందని చెప్పారట. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని వేణు స్వామి చెప్పారని, కానీ అక్కడ కాంగ్రెస్ గెలిచిందని.. ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ కప్ గెలుస్తుందని కూడా వేణు స్వామి చెప్పారని, అది కూడా జరగలేదని.. టీడీపీ లాజిక్ తీస్తోంది. అంటే వేణు స్వామి చెప్పేవి జరగవని తేలిపోయిందని, ఏపీలో వైసీపీ గెలుస్తుందని వేణు స్వామి చెప్పారు కాబట్టి.. ఆయన మాటతో ఆ పార్టీ ఓటమి ఖాయమని తీర్మానించారు. వేణు స్వామి ఫొటోల్ని టీడీపీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి మరీ కామెంట్ చేస్తోంది.