ప్రకాశం భూ కబ్జాలు.. అందులో రెండు పార్టీలవారు

అరెస్ట్ అయినవారిలో బాలినేని అనుచరులు ఉన్నారా, లేక వైవీ సుబ్బారెడ్డి అనుచరులు ఉన్నారా అనేది బయటకు రావడంలేదు. రెండు ప్రధాన పార్టీలకు చెందినవారు ఉన్నారని మాత్రం అధికారులు అంటున్నారు.

Advertisement
Update:2023-11-03 22:16 IST

వైసీపీ అంతర్గత రాజకీయంగా మారిన ప్రకాశం జిల్లా భూ కబ్జా విచారణలో ఎట్టకేలకు తొలి అడుగు పడింది. ఈ వ్యవహారంలో మొత్తం 54 కేసులు నమోదు చేసి, ఇప్పటి వరకు 38 మందిని అరెస్టు చేశామన్నారు ఉన్నతాధికారులు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మలికా గార్గ్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలియజేశారు. 40 మందిని త్వరలో అరెస్టు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. అరెస్టైన వారిలో రెండు ప్రధాన పార్టీలకు చెందినవారు ఉన్నట్టు అధికారులంటున్నారు.

మాస్టర్ ప్లాన్..

భూకబ్జా ముఠా పెద్ద ప్లానే వేసింది. ఒంగోలు నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 10నుంచి 12 ఏళ్లుగా ఖాళీగా ఉన్న స్థలాలను వీరు గుర్తిస్తారు. ఇలా ఒంగోలులో 52 ఆస్తుల్ని గుర్తించి వాటికి నకిలీ జీపీఏ, వీలునామాలు సృష్టించారు, ఆ తర్వాత దర్జాగా కబ్జా చేశారు. ఈ కేసులో కబ్జాదారులకు ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా సహకరించాడు. అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలు నగరంలోని లాయర్‌ పేటలో ఓ ఇంట్లో సోదాలు నిర్వహించగా.. పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కొన్ని పత్రాలు సృష్టిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మీసేవ కేంద్రాల్లో లభించే అన్ని పత్రాలు అక్కడ ఉన్నాయి. నకిలీ స్టాంపులు, ఫోర్జరీ డాక్యుమెంట్లు కనపడేసరికి పోలీసులే షాకయ్యారు. 123 నకిలీ డాక్యుమెంట్లు, 25 నకిలీ స్టాంపులు సీజ్‌ చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తుకోసం సబ్ రిజస్ట్రార్‌, రెవెన్యూ అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్‌ ఏర్పాటు చేశాక 572 నకిలీ పత్రాలు సీజ్‌ చేశారు.

భూకబ్జా కేసులో ఇప్పటి వరకు 72 మందిని నిందితులుగా గుర్తించినట్లు కలెక్టర్ దినేష్‌ కుమార్‌ తెలిపారు. 38 మందిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. మార్కాపురం, కనిగిరి నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయని, అక్కడ కూడా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

అయితే ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో హైలైట్ అయింది. మాజీ మంత్రి బాలినేని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేరుగా సీఎంఓకి ఫిర్యాదు చేశారు. ఓ దశలో తన గన్ మెన్లను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఇటీవల సీఎం జగన్ ని ఇదే విషయంపై నేరుగా కలసి మాట్లాడారు. అయితే అరెస్ట్ అయినవారిలో బాలినేని అనుచరులు ఉన్నారా, లేక వైవీ సుబ్బారెడ్డి అనుచరులు ఉన్నారా అనేది బయటకు రావడంలేదు. రెండు ప్రధాన పార్టీలకు చెందినవారు ఉన్నారని మాత్రం అధికారులు అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News