పవన్‌ కల్యాణ్‌ నిర్ణయంతో కంగుతిన్న పోతిన మహేష్‌

విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే కేటాయించాలని, పార్టీ కోసం చాలా ఖర్చు చేశానని, ఇబ్బందులు ఎదుర్కున్నానని, కోర్టు కేసులు కూడా తప్పలేదని, విజయవాడలో జనసేన నిలబడిందంటే అది తన వల్లనే అని ఆయన అన్నారు.

Advertisement
Update:2024-03-15 14:26 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తాను పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు విజయవాడ పశ్చిమ సీటులో ఆయనకు అసమ్మతి సెగ తగిలింది. విజయవాడ పశ్చిమ సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. దీంతో ఈ సీటు నుంచి జనసేన త‌ర‌ఫున‌ పోటీ చేయాలని కోరుకుంటున్న పోతిన మహేష్‌ కంగుతిన్నారు.

విజయవాడ పశ్చిమ నుంచి తాను పోటీ చేస్తున్నానని ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసుకున్నారు. ఆ సీటును ఆయనకు ఇవ్వకపోవడంతో జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. దీంతో అన్ని డివిజన్ల ఇన్‌చార్జ్‌లు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పోతిన మహేష్‌కు టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఇన్‌చార్జ్‌లు, కార్యకర్తల సమావేశంలో పోతిన మహేష్‌ మాట్లాడారు. విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే కేటాయించాలని, పార్టీ కోసం చాలా ఖర్చు చేశానని, ఇబ్బందులు ఎదుర్కున్నానని, కోర్టు కేసులు కూడా తప్పలేదని, విజయవాడలో జనసేన నిలబడిందంటే అది తన వల్లనే అని ఆయన అన్నారు. పవన్‌ పోటీ చేసే స్థానంలో టీడీపీ కార్యకర్తలు గొడవ చేశారని, పిఠాపురంలో అంతగా నష్టం జరిగితే ఒక్క టీడీపీ నేత కూడా స్పందించలేదని ఆయన అన్నారు. ఇదేనా పొత్తు ధర్మమని ఆయన న్రశ్నించారు.

పొత్తు ధర్మం పాటిస్తేనే ఓట్ల బదిలీ జరుగుతుందని ఆయన అన్నారు. మన పార్టీ నాయకుడు బాగోకపోతే మనం బాగుంటామా అని ఆయన ప్ర‌శ్నించారు. విజయవాడలో కార్యకర్తలకు భవిష్యత్తు ఉండాలంటే జనసేనకు విజయవాడ పశ్చిమ సీటు కేటాయించాల్సిందేనని ఆయన అన్నారు. చివరగా తాను జనసేన నుంచే పోటీ చేస్తానని అన్నారు.

Tags:    
Advertisement

Similar News