పవన్ ని మరో రంగా అనుకున్నారు.. కానీ..!
సలహాలిచ్చేవారంతా వైసీపీ కోవర్టులంటున్న పవన్ కల్యాణ్ కు.. ముద్రగడను చంద్రబాబు ఎంతగా వేధించారో తెలియదా అని ప్రశ్నించారు పోసాని.
పవన్ కల్యాణ్ తమ సామాజిక వర్గానికి మరో వంగవీటి రంగా అవుతారని కాపులంతా భావించారని, కానీ ఆయన మాత్రం వాళ్లని మోసం చేశారని అన్నారు పోసాని కృష్ణ మురళి. చంద్రబాబుని సీఎం చేయాలనుకుంటున్న పవన్ కి కాపులు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. పవన్ వెనక నాదెండ్ల, పవన్ గుండెల్లో చంద్రబాబు ఉన్నారని చెప్పారు పోసాని.
ఎన్టీఆర్ కంటే గొప్పవాడు రంగా
వంగవీటి రంగాను చంద్రబాబు చంపించారనే విషయం అందరికీ తెలుసని అన్నారు పోసాని. ఐదు జిల్లాల్లో ఎన్టీఆర్ కంటే రంగా గొప్పవారని.. ఆయన్ను టీడీపీ నేతలు ఎంతగా హింసించారో అందరికీ తెలుసన్నారు. ఎన్టీఆర్ ని మించిపోతున్నాడనే కోపంతోనే రంగాను హత్య చేయించారన్నారు. రంగా కారులో చిన్న కర్ర దొరికినా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లేవారని చెప్పారు. ఒక దశలో తనకు ప్రాణహాని ఉందనే విషయం రంగాకు కూడా అర్థమైందన్నారు. కానీ అంతలోనే ఆయన్ను హత్య చేయించారని చెప్పారు పోసాని.
రంగాకు, పవన్ కి పోలికా..?
రంగా కాపులకోసం బతికారని, పవన్ కల్యాణ్ చంద్రబాబుకోసం పనిచేస్తున్నారని వారిద్దరికి మధ్య తేడా చెప్పారు పోసాని. కాపులు అండగా ఉంటే సీఎం అవుతానని చెప్పిన పవన్ చివరకు చంద్రబాబుని సీఎం చేయాలనుకోవడమేంటని ప్రశ్నించారు. ఆయన రంగాలాగా ఉంటారని కాపులు భావించారు కానీ, మధ్యలోనే పవన్ అస్త్ర సన్యాయం చేశారన్నారు. తాను సీఎం కాలేనని పవన్ డిసైడ్ అయ్యారన్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణను కూడా తిట్టిన పవన్.. ఇప్పుడు వారికోసం పనిచేస్తున్నారని చెప్పారు పోసాని.
ముద్రగడపై ఎందుకు నిందలు..?
సలహాలిచ్చేవారంతా వైసీపీ కోవర్టులంటున్న పవన్ కల్యాణ్ కు.. ముద్రగడను చంద్రబాబు ఎంతగా వేధించారో తెలియదా అని ప్రశ్నించారు పోసాని. ముద్రగడను వేధించినప్పుడు మాట్లాడని పవన్.. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మాత్రం గగ్గోలు పెట్టారని ఎద్దేవా చేశారు. కాపులను తిట్టిన వారితో పవన్ ఇప్పుడు ఎందుకు కలిశారని సూటిగా ప్రశ్నించారు పోసాని.