షర్మిల తప్పుడు ఆరోపణలను ఖండించిన పొన్నవోలు

వైఎస్సార్ మీద ఆరోపణలు చేస్తుంటే, అన్యాయంగా కేసులలో ఇరికిస్తుంటే చూడలేకే తాను కేసులు వేశానని తెలిపారు పొన్నవోలు. ఆయన మీద కేసు పెట్టడం అన్యాయమని వాదించింది తానేనన్నారు.

Advertisement
Update:2024-04-26 18:59 IST

ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ షర్మిల తన వికృత రాజకీయ నిజ స్వరూపాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారు. అయితే ఆమె చేస్తున్న ఆరోపణల్లో పస లేదని, చంద్రబాబులాగా పదే పదే ఒకే అబద్ధాన్ని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం అందరికీ అర్థమవుతోంది. తాజాగా షర్మిల ఇలాంటి ఆరోపణలే చేశారని, అసత్యాలతో జగన్ పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు ఏపీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.

షర్మిల తన రాజకీయ లబ్ధికోసం ఇటీవల సీఎం జగన్ ని టార్గెట్ చేశారు. వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, స్యయంగా తన అన్న వైఎస్ జగనే అని షర్మిల ఓ సభలో నిందలు వేశారు. తన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా వైఎస్సార్ పేరును ఛార్జిషీట్‌లో జగన్ చేర్పించారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలకు పొన్నవోలు సుధాకర్ ప్రెస్‌మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు.

అసలు నిజం ఇదే..

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే ఆనాడు వైఎస్సార్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని గుర్తు చేశారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వైఎస్సార్‌పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని, ఆ లేఖతోనే విచారణ మొదలైందన్నారు. అప్పటి టీడీపీ నేత ఎర్రన్నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని తెలిపారు. వైఎస్సార్‌ను కాంగ్రెస్ ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా..? అని ప్రశ్నించారు పొన్నవోలు.

వైఎస్సార్ మీద ఆరోపణలు చేస్తుంటే, అన్యాయంగా కేసులలో ఇరికిస్తుంటే చూడలేకే తాను కేసులు వేశానని తెలిపారు పొన్నవోలు. ఆయన మీద కేసు పెట్టడం అన్యాయమని వాదించింది తానేనన్నారు. వేరే 14 మందిని బాధ్యులుగా చేయాలని మాత్రమే తాను కేసు వేశానని, ఆ కాపీలను పంపిస్తానని, షర్మిల చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. షర్మిల చెప్పినట్టు తాను వైఎస్సార్ మీద కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. సీబీఐ, కాంగ్రెస్ కలిసే వైఎస్ఆర్‌ను ఇరికించారని, ఆ విషయాన్ని నిరూపించడానికే వారికి ఎదురొడ్డి తాను పోరాటం చేశానన్నారు. అలాంటి తనను అభినందించాల్సిందిపోయి తనపైనే ఆరోపణలు చేయడం దారుణం అన్నారు పొన్నవోలు. 

Tags:    
Advertisement

Similar News