నాడు బాబు, నేడు పవన్.. ఏమున్నది గర్వ కారణం?

ప్రధాని ఒక రాష్ట్ర పర్యటనలో బీజేపీయేతర ప్రాంతీయ పార్టీ అధ్యక్షునితో సమావేశం కావడమే ప్రాధాన్యం. జనసేన అధినేత పవన్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ ‘మనం తరచూ కలుసుకుందాం’ అని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update:2022-11-12 16:29 IST

ప్రధాని మోడీ ఢిల్లీలో చంద్రబాబుకు చెప్పిన మాటే పవన్‌కు చెప్పారా? అనే చర్చ మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఒక పరిణామాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మాటలకు చేతలకు తేడా ఉంటుందన్న విషయాన్ని ఆ ఘటన స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంట్రల్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశం జరిగింది. దీనికి పలువురు రాజకీయ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ప్రముఖుల వద్దకు వెళ్లిన మోడీ పేరు పేరునా పలకరించారు.

ఆ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబును మోడీ పలకరించారు. ఆయనను పక్కకు తీసుకెళ్లి ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడిన వైనం అప్పట్లో ఆసక్తికరంగానే కాదు, కొత్త విశ్లేషణలకు తావిచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? అన్న విషయానికి సంబంధించి పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. వాటిల్లో ఒక మాట చాలా మందిని ఆకర్షించింది. చంద్రబాబును ఉద్దేశించి నరేంద్ర మోడీ "మనం కలిసి చాలా కాలమైంది. మీకు కుదిరినప్పుడు కలవొచ్చు కదా? ఇకపై తరచూ కలుసుకుందాం" అని అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇది జరిగి మూడు నెలలు అయ్యింది. చంద్రబాబుకు మోడీ నుంచి పిలుపు రాలేదు. ఆయన ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలవలేదు.

తాజాగా ప్రధాని శుక్ర, శని వారాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో చంద్రబాబును కలిసేందుకు ఆసక్తి చూపలేదు. అలాంటి ఆహ్వానం ఆయనకు రాలేదు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. వీరిద్దరి మధ్య 40 నిమిషాల పాటు భేటీ జరిగిందన్నది బూటకం. పట్టుమని 10 నిమిషాలు కూడా ఈ సమావేశం జరగలేదు. భేటీ సమయం ఎంత అన్నది అప్రస్తుతం. ప్రధాని ఒక రాష్ట్ర పర్యటనలో బీజేపీయేతర ప్రాంతీయ పార్టీ అధ్యక్షునితో సమావేశం కావడమే ప్రాధాన్యం. జనసేన అధినేత పవన్‌ను ఉద్దేశించి ప్రధాని మోడీ 'మనం తరచూ కలుసుకుందాం' అని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోడీ నుంచి ఆ మాట రావటమే పది వేలు అన్నట్టుగా జనసైనికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తనను కలిసిన ప్రతి ముఖ్యుడితోనూ ప్రధాని నోటి నుంచి ఆ మాట క్యాజువల్‌గా వస్తుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. దానికే సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కావల్సిన అవసరం లేదన్నది వారి వాదన. ఎవరినైనా, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి నైనా ప్రధాని స్థాయి నాయకుడు తరచూ కలిసే సందర్భాలు అత్యంత అరుదు. అది కూడా నాన్ బీజేపి నాయకులతో.. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్.. బీజేపీ వదలబోతున్న బాణంగా విశ్లేషణ చేయవచ్చు.

Tags:    
Advertisement

Similar News