తన బెస్ట్ ఆప్షన్ ఎవరో మోడీ చెప్పేశారా..?

పార్లమెంటులో వైసీపీ తరపున 31 మంది ఎంపీలున్నారు. ఎన్డీయేలో బీజేపీని మినహాయిస్తే మిగిలిన భాగస్వామ్య పార్టీలకు ఆరుగురు ఎంపీలకన్నా బలమున్న పార్టీ ఏదీలేదు.

Advertisement
Update:2022-11-13 09:41 IST

రెండురోజుల విశాఖపట్నం పర్యటనలో తన ఆలోచనలేంటో నరేంద్రమోడీ అందరికీ స్పష్టంగా చెప్పారా..? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకందుకు భేటీ అయితే అది మరోరకమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. భేటీలో చంద్రబాబు నాయుడును కూడా మిత్రపక్షంగా కలుపుకునేట్లుగా మోడీని కన్వీన్స్ చేయాలన్నది పవన్ అజెండా. మోడీ గనుక పవన్ సూచనకు సానుకూలంగా స్పందించుంటే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయుండేవి.

అయితే.. పవన్ సూచనలను మోడీ సున్నితంగానే తిరస్కరించారు. ఇదే సమయంలో బీజేపీతోనే కలిసి నడవాలని పవన్ కు చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాలని ప్రయత్నించినా తనకన్నీ తెలుసంటూ మోడీ చాలా సున్నితంగానే పవన్‌ను క‌ట్ చేసేశారు. వీళ్ళ భేటీతో అందరికీ స్పష్టంగా అర్థ‌మయ్యిందేమంటే మోడీ ఆప్షన్ చంద్రబాబు కాదు జగన్ మాత్రమేనని. జగన్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటే బేషరతుగా మోడీ ప్రభుత్వానికి జగన్ మద్దతిస్తున్నారు.

పార్లమెంటులో వైసీపీ తరపున 31 మంది ఎంపీలున్నారు. ఎన్డీయేలో బీజేపీని మినహాయిస్తే మిగిలిన భాగస్వామ్య పార్టీలకు ఆరుగురు ఎంపీలకన్నా బలమున్న పార్టీ ఏదీలేదు. పైగా ఎన్డీయేలో నుండి జేడీయూ లాంటి పార్టీలు కొన్ని వెళ్ళిపోయాయి. రాజ్యసభలో ఏ బిల్లు పాసవ్వాలన్నా జగన్ మద్దతులేనిదే సాధ్యంకాదు. ఇలాంటి పరిస్ధితుల్లో బలమైన, నమ్మకమైన మద్దతుదారుడు జగన్‌ను దూరం చేసుకోవటానికి మోడీ ఇష్టపడటంలేదు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గురించి మోడీకి ఇంకెవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేలేదు.

అవసరమైనప్పుడు చంద్రబాబు ఎలాగుంటారు.. అవసరం తీరిపోయిన తర్వాత ఎలాగుంటారనే విషయం మోడీతో సహా బీజేపీ నేతలందరికీ బాగా అనుభవమే. జగన్-చంద్రబాబు మనస్తత్వంలో ఇంత తేడా ఉండటమే కాకుండా భవిష్యత్తులో టీడీపీ కోలుకుంటుందనే నమ్మకం కూడా మోడీకి ఉన్నట్లులేదు. తాముమద్దతిచ్చి చంద్రబాబును ఎందుకు బలోపేతం చేయాలన్నదే మోడీ పాయింట్. 2024 ఎన్నికల వరకు వెయిట్ చేస్తే టీడీపీ భవిష్యత్తేంటో తేలిపోతుంది. ఆ తర్వాత సంగతి అప్పుడు చూసుకోవచ్చని అనుకున్నట్లున్నారు. అందుకనే ఇప్పటికైతే తన బెస్ట్ ఆప్షన్ జగన్ మాత్రమే అని మోడీ స్పష్టం చేసినట్లయ్యింది.

Tags:    
Advertisement

Similar News