175లో పిఠాపురం ఒకటి.. అంతకు మించి స్పెషల్ ఏముంది..?

పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి బలంగా ఉన్నారని, కొత్తగా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు మిథున్ రెడ్డి. పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు.

Advertisement
Update:2024-04-13 15:01 IST

ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటని, అంతకు మించి ఆ నియోజకవర్గం స్పెషాలిటీ ఏముందని ప్రశ్నించారు ఎంపీ మిథున్ రెడ్డి. రీజనల్ కోఆర్డినేటర్ గా ఆయన పిఠాపురంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో పాటు సీనియర్ నేతలతో ఆయన గెలుపు వ్యూహాలపై చర్చించారు. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి బలంగా ఉన్నారని, కొత్తగా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు మిథున్ రెడ్డి. పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. ఇక్కడ తమ అభ్యర్థి వంగా గీత విజయం ఖాయమని చెప్పారు మిథున్ రెడ్డి.

పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని, అందుకే ఆయనకు ఈసారి పిఠాపురం ప్రత్యేకమైందని, ఇక్కడ ప్రచారంకోసం ఆపసోపాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు మిథున్ రెడ్డి. జనసేనలో మొదటి నుంచి ఉన్న నేతల్లో పవన్ కల్యాణ్ ఎంతమందికి న్యాయం చేశారని ప్రశ్నించారు. ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుని పవన్ టికెట్లు ఇచ్చారని నిలదీశారు. జనసేనకు కేటాయించిన సీట్లను కూడా టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన వారికి ఇచ్చారని, జనసేనను నమ్ముకుని ఉన్నవారిని పవన్ మోసం చేశారని అన్నారు.

ఏపీలో అధికారంలోకి వచ్చేది మళ్లీ వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి. తమ సోషల్ ఇంజినీరింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఉందన్నారు. రాజంపేటలో తనకు ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డిపై కూడా ఆరోపణలు చేశారు మిథున్‌రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి పేరు గొప్ప ఊరుదిబ్బ అని అన్నారు. ఆస్తులు కాపాడుకోడానికే ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారని చెప్పారు. గతంలో ఎప్పుడూ నియోజకవర్గంవైపు చూడని వ్యక్తి, స్థానికంగా ఎవరికీ ఎప్పుడూ సాయం చేయని వ్యక్తి.. అక్కడ గెలుస్తారా అని ప్రశ్నించారు మిథున్ రెడ్డి. 

Tags:    
Advertisement

Similar News