అజ్ఞాతం వీడిన పిన్నెల్లి.. ఎస్పీ ఎదుట హాజరు
రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఎదుట హాజరయ్యారు ఎమ్మెల్యే పిన్నెల్లి. కోర్టు విధించిన బెయిల్ షరతుల్లో భాగంగా పిన్నెల్లి ప్రతిరోజూ జిల్లా ఎస్పీ ఎదుట హాజరు కాావాల్సి ఉంది.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆఫీస్ కి వెళ్లి ఆమెను కలిశారు. బెయిల్ కండిషన్లలో ఎస్పీ ఎదుట హాజరవ్వాలనే నిబంధన కూడా ఉండటంతో అజ్ఞాతం వీడిన తర్వాత ఆయన నేరుగా జిల్లా ఎస్పీని కలిశారు.
ఎన్నికల రోజు పల్నాడులో గొడవలు జరగడంతో పోలీసులు పిన్నెల్లిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్ వెళ్లారు. దీంతో గొడవ మొదలైంది, ఆ తర్వాత ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చింది. ఈ వ్యవహారంపై ఈసీ మరింత సీరియస్ కావడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేయడం, పోలీసులు మరికొన్ని కేసుల్లో ఆయన్ను నిందితుడుగా చేర్చడం తెలిసిందే. చివరకు అన్ని కేసుల్లోనూ ఆయనకు ముందస్తు బెయిల్ రావడంతో ఊరట లభించినట్టయింది.
మూడు కేసుల్లో జూన్ 6 వరకూ పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ మంగళవారం మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత ఆయన రాత్రి 9 గంటలకు నరసరావుపేట చేరుకుని స్థానికంగా ఓ హోటల్‌లో బస చేశారు. రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఎదుట హాజరయ్యారు. కోర్టు విధించిన బెయిల్ షరతుల్లో భాగంగా పిన్నెల్లి ప్రతిరోజూ జిల్లా ఎస్పీ ఎదుట హాజరు కాావాల్సి ఉంది.