ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్.. అప్పుడే మొదలైన ఆరోపణలు

కక్షసాధించడానికి కాదు మేం అధికారంలోకి వచ్చిందని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు, ప్రమాణ స్వీకారానికి ముందే ఇలా సరికొత్త వ్యూహాలు బయట పెట్టారు.

Advertisement
Update:2024-06-05 14:17 IST

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలోని పెద్దలందర్నీ ఇందులో సూత్రధారులుగా అనుమానిస్తున్నారు. పాత్రధారులైన పోలీసులు కటకటాల వెనక ఉన్నారు. ట్యాపింగ్ పేరుతో వారు చేసిన దందాల గురించి వింటే షాక్ అవక తప్పదు. ఇలాంటి ట్యాపింగ్ వ్యవహారమే ఏపీలో కూడా జరిగిందనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజే టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సరికొత్త ఆరోపణలు తెరపైకి తెచ్చారు. గత ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన టార్గెట్ చేశారు.

గతంలో కూడా..

ఫోన్ ట్యాపింగ్ తో వైరి వర్గాలపై వైసీపీ దృష్టిపెట్టిందని గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను కూడా ట్యాపింగ్ బాధితుడినేనంటూ ఆయన పార్టీనుంచి బయటకొచ్చారు. తాజాగా ఇప్పుడు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం విశేషం. ఆయన కూడా వైసీపీలో ఉంటూ, టికెట్ దొరక్క బయటకు వచ్చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని అన్నారు డొక్కా. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలను ప్రభుత్వం రికార్డ్ చేసిందని ఆరోపించారాయన. ఈ రికార్డింగ్ ల ఆధారంగానే గత ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందంటున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

డొక్కా మాణిక్య వరప్రసాద్ తనకు తానే బయటకు వచ్చి ఈ ఆరోపణలు చేశారని అనుకోలేం. టీడీపీ అధిష్టానం నిర్ణయం మేరకే ఆయన ఫోన్ ట్యాపింగ్ అంటూ మీడియా ముందుకొచ్చారు. విచారణకు సిద్ధమైన తర్వాతే టీడీపీ ఇలా ఆరోపణలు చేయించి ఉంటుంది. కక్షసాధించడానికి కాదు మేం అధికారంలోకి వచ్చిందని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు, ప్రమాణ స్వీకారానికి ముందే ఇలా సరికొత్త వ్యూహాలు బయట పెట్టారు. వైసీపీలో ఎంతమంది కీలక నేతల్ని ఇలా టార్గెట్ చేస్తారో వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News