ఆ వాట్సప్ గ్రూప్ ఎందుకు..? సాక్ష్యాలు లేకుండా చేసేందుకా..?
ఏపీలో రోజురోజుకి హింస పెరుగుతోందన్నారు పేర్ని నాని. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చెప్పారు.
ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వాట్సప్ గ్రూప్ పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారని.. సాక్ష్యాలు లేకుండా చేసేందుకే ఆ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. తమ నాయకులు ఏం చెబితే అది చేయాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారన్నారు. గతంలో జగన్ మాత్రం అందరికీ న్యాయం చేయాలని చెప్పేవారని గుర్తు చేశారు. చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్, గతంలో జగన్ కలెక్టర్ల మీటింగ్ వీడియోలను ఆయన ప్రెస్ మీట్ లో ప్లే చేసి చూపించారు. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని చంద్రబాబు బాహాటంగానే చెబుతున్నారని ఎద్దేవా చేశారు పేర్ని నాని.
ఏపీలో రోజురోజుకి హింస పెరుగుతోందన్నారు పేర్ని నాని. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చెప్పారు. పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరో తెలిసినా పోలీసులు వారి పేర్లను బయటకు చెప్పడం లేదన్నారు నాని. కనీసం ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేయడం లేదన్నారు. నంద్యాలలో టీడీపీ నేతలు మారణాయుధాలతో రోడ్లపై తిరుగుతున్నారని, ఏపీలో విచిత్రమైన పోలీస్ వ్యవస్థ ఉందన్నారు నాని. బీహార్‌లో ప్రభుత్వ ప్రేరేపిత ఘటనలు జరిగేవని, ఇప్పుడు అక్కడ కూడా శాంతి భద్రతలు సక్రమంగానే ఉన్నాయని, కానీ ఏపీ మాత్రం బీహార్ లా తయారైందని విమర్శించారు. శాంతిభద్రతల విషయంలో చిలక పలుకులు పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పుడు దారుణాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు పేర్ని నాని.
వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తానని ఎగ్గొట్టారని, మేనిఫెస్టో పథకాల గురించి చంద్రబాబు కలెక్టర్లతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు పేర్ని నాని. 2019లో జగన్ అధికారంలోకి వచ్చే నాటికి ఖజానా ఖాళీగా ఉన్నా పథకాలు అమలు చేశామని, ఇప్పుడు చంద్రబాబు మాత్రం కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాని సర్వనాశనం చేసింది చంద్రబాబేనన్నారు నాని. అలాంటి వ్యక్తి ఫేక్ న్యూస్ అంటూ ట్వీట్లు చేయడం హాస్యాస్పదం అన్నారు. వైఎస్ జగన్ మీద విషం కక్కిన ఎల్లో మీడియా మంచిదా? నిజాలు రాసే సాక్షి మీద కేసులు పెడతారా..? అని ప్రశ్నించారు పేర్ని నాని.