ఎగ్ పఫ్ లపై తొలిసారి వైసీపీ రియాక్షన్
దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని, ఎగ్ పఫ్ ల కోసం ఖర్చు చేసిన లెక్కలు, ఆ వివరాలు ఉన్న ఫైళ్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు నాని.
ఏపీ రాజకీయాలు ఎగ్ పఫ్ లు, కాలిపోయిన పాత ఫైళ్లు, రుషికొండ బాత్ రూమ్ లు.. వీటి చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార, విపక్షాల విమర్శలు కూడా మరీ నాసిరకంగా తయారయ్యాయనే వాదన వినపడుతోంది. తాజాగా ఎగ్ పఫ్ ఖర్చులంటూ గత వైసీపీ ప్రభుత్వంపై కొత్త ప్రభుత్వం ఓ నింద వేసింది. గత ఐదేళ్లలో సీఎం ఆఫీస్ లో ఎగ్ పఫ్ బిల్లులు రూ.3.62కోట్లు అంటూ ఓ ఆరోపణ చేసింది. అంటే ఏడాదికి ఎంత..? రోజుకి ఎంత..? అసలు ఎగ్ పఫ్ రేటెంత..? అంటూ కొన్నిరోజులుగా వైసీపీపై అటాక్ మొదలు పెట్టింది. దీనికి కేవలం సోషల్ మీడియాలో మాత్రమే బదులిచ్చి సరిపెట్టింది వైసీపీ. తాజాగా ఆ పార్టీ నుంచి పేర్ని నాని కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు. ఆ లెక్కలేంటో బయటపెట్టాలన్నారు.
రూ.3.62 కోట్లతో ఎగ్ పఫ్‌లు తిన్నారని టీడీపీ తప్పుడు పోస్టులు పెడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. సీఎం చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయటపెట్టాలన్నారు. ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ చంద్రబాబు దగ్గరే ఉంది కాబట్టి.. ఆయనే ఈ వివరాలు చెప్పాలని నిలదీశారు పేర్ని నాని.
ఆ అలవాటు మీదే..
బొద్ధింకలు, ఎలుకలు పట్టుకునేందుకు కోట్ల రూపాయలు చెల్లించిన చరిత్ర చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు పేర్ని నాని. పాలించే సత్తాలేకే జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపాలని, సూపర్ సిక్స్ హామీల అమలుపై దృష్టిపెట్టాలని సీఎం చంద్రబాబుకి సూచించారు. జగన్ పై పడి ఏడవడం మానుకోవాలని హితవు పలికారు. దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని, ఎగ్ పఫ్ ల కోసం ఖర్చు చేసిన లెక్కలు, ఆ వివరాలు ఉన్న ఫైళ్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు నాని.