ఆ పాపపు నోటితోనే నిజాలు చెప్పాల్సిన పరిస్థితి
సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి.. పెన్షన్ల పంపిణీకి వారిని వినియోగించొచ్చని అంటున్నారు. ఆ పాపపు నోటితోనే వారు ఇప్పుడు నిజాలు చెప్పాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.
ఏపీలో పెన్షన్ల వ్యవహారంలో టీడీపీ పూర్తిగా ఇరుక్కుపోయింది. గతంలో సీఎం జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాలేదని విమర్శించిన టీడీపీ నేతలు.. ఇప్పుడు లక్షా60వేలమంది సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయించొచ్చు కదా అని చెబుతున్నారు. వారు ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి.. పెన్షన్ల పంపిణీకి వారిని వినియోగించొచ్చని అంటున్నారు. ఆ పాపపు నోటితోనే వారు ఇప్పుడు నిజాలు చెప్పాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.
పేదలపై ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా..?
58 నెలలు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించామని.. ఈ మూడు నెలలు ఆపిన ఘనత కూడా టీడీపీదేనని.. ఇప్పుడు అదే చంద్రబాబు పెన్షన్లు ఇంటింటికీ వెళ్లి ఇవ్వాలని ఈసీకి లేఖలు రాసి లబ్ధిదారులపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు పేర్ని నాని. వాలంటీర్లపై విషం కక్కిన చంద్రబాబు, వారు చేసిన పనిని ఇప్పుడెందుకు మెచ్చుకుంటున్నారని, ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థ దుర్మార్గమైనదైతే ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కదా? అన్నారు. పెన్షన్లపై చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు నాని.
ఆనాడు మేం ఇలానే చేశామా..?
2019 ఎన్నికల సమయంలో రైతులకు జన్మభూమి కమిటీల ద్వారా డబ్బులు పంచుతున్నా తాము అడ్డుకోలేదని, పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు నిధులు విడుదల చేసినా తాము అడ్డుపడలేదని చెప్పారు పేర్ని నాని. ఇప్పుడు చంద్రబాబు పెన్షన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టిన చంద్రబాబుకి విశ్వసనీయత లేదన్నారు నాని.
ఐదేళ్ల జగన్ పరిపాలన చూసి ఓటేస్తారా లేక చివరి 2 నెలలు పెన్షన్లు ఎవరిచ్చారో చూసి ఓటేస్తారా అని ప్రశ్నించారు పేర్ని నాని. పెన్షన్లు ఆపాలన్న దౌర్భాగ్యపు ఆలోచన ఎవరికి వచ్చిందని అన్నారు. వృద్ధులు, దివ్యాంగుల ఉసురు వారికి కచ్చితంగా తగులుతుందని అన్నారు నాని.