ఏపీలో పెన్షన్ కష్టాలు.. 1.5లక్షల మంది అగచాట్లు

ఇప్పటికే వీరందరికీ నోటీసులు జారీ అయ్యాయి. అయితే వీరికి జనవరి 1న పెన్షన్ అందుతుంది. కానీ ఆ తర్వాత 15రోజుల్లోగా పెన్షన్ కి తాము అర్హులమేనంటూ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. లేకపోతే వారికి ఇక పెన్షన్ ఎప్పటికీ రాదు.

Advertisement
Update:2022-12-25 15:34 IST

అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్లను 3వేల రూపాయలకు పెంచుతానని ప్రకటించిన జగన్.. క్రమక్రమంగా పెంపుని అమలులోకి తెస్తున్నారు. 2023 జనవరి 1నుంచి సామాజిక పెన్షన్ 2750 రూపాయలు కాబోతోంది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు. పెన్షన్ ని పెంచుతూనే అనర్హులను ఏరిపారేసే నిర్ణయం తీసుకున్నారు. ఇంటి విస్తీర్ణం, పొలం విస్తీర్ణం, కరెంటు బిల్లు, నాలుగు చక్రాల వాహనాలు, ట్యాక్స్ పేయర్లు అనే పేరుతో దాదాపుగా 1.5లక్షల పెన్షన్లు కట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరందరికీ నోటీసులు జారీ అయ్యాయి. అయితే వీరికి జనవరి 1న పెన్షన్ అందుతుంది. కానీ ఆ తర్వాత 15రోజుల్లోగా పెన్షన్ కి తాము అర్హులమేనంటూ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. లేకపోతే వారికి ఇక పెన్షన్ ఎప్పటికీ రాదు.

ఎందుకిదంతా..?

అనర్హులకు పెన్షన్ కట్ చేయడం సబబే. కానీ ఇలా పెంపు వేళ పెన్షన్లు కట్ చేయడం మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. ఇన్నాళ్లూ ఇచ్చిన పెన్షన్ ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోతుంది అనే సరికి బాధితులుగా మారుతున్న లబ్ధిదారులు మండిపడుతున్నారు. అసలు పెన్షన్ ని పెంచాలని ఎవరైనా అడిగారా, ఇప్పుడిలా మొత్తానికే సున్నా చుట్టడం దేనికంటూ మండిపడుతున్నారు.

ఏపీలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం సామాజిక పింఛన్లు అందిస్తోంది. మొత్తం 62 లక్షలమంది లబ్ధిదారులు వివిధ కేటగిరీల కింద పెన్షన్లు అందుకుంటున్నారు. గతంలో పంచాయతీ ఆఫీసుల్లో పడిగాపులు కాయాల్సి ఉండగా, ఇప్పుడు నేరుగా వాలంటీర్లే ఒకటో తేదీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు అనర్హత వేటు పడినవారు మాత్రం జగన్ పై రగిలిపోతున్నారు.

గతంలో జరిగిన సాధికార సర్వే ఆధారంగా పెన్షన్లు కట్ చేస్తున్నారు. వాస్తవానికి ఇన్ కమ్ ట్యాక్స్ కట్టే పిల్లలున్న తల్లిదండ్రులకు ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకూడదు. కానీ ఆ పిల్లలు పట్టించుకోని తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి..? కొడుకు సంపాదన ఆధారంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు పెన్షన్ కట్ చేస్తామంటే ఏం చేయాలి. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. పెన్షన్ మీద ఆధారపడిన చాలామంది లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. వచ్చేనెల 15వరకు ప్రభుత్వం గడువు విధించింది. ఈలోగా జగన్ తమపై కనికరం చూపకపోతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ నిర్ణయంలో మార్పు లేకపోతే మాత్రం పెన్షన్ దారుల్లో చాలామంది బాధితులుగా మారిపోతారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, స్థానిక నేతల వద్దకు వెళ్లి వీరు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉందని నాయకులు కూడా ఈ విషయాన్ని అధిష్టానానికి చేరవేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News