భయపెడుతున్న లెక్కలు.. వచ్చేనెల పెన్షన్ పెరుగుతుందా..?
జులై-1న పెన్షన్ లబ్ధిదారులకు రూ.4వేల పెన్షన్, రూ.3వేల బకాయిలతో కలిపి మొత్తం రూ.7వేలు అందాల్సి ఉంటుంది. వికలాంగులకయితే పెన్షన్ రెట్టింపు కావాల్సి ఉంది.
ఏపీలో ఉన్న పెన్షన్ లబ్ధిదారులు 65.30 లక్షలమంది
ప్రతి నెలా వీరికి చెల్లిస్తున్న సొమ్ము రూ.1,939 కోట్లు
కూటమి ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెలా పెంచి ఇవ్వాల్సిన మొత్తం రూ.2,800 కోట్లు
50 ఏళ్లు పైబడిన వారికి కూడా పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఆ మొత్తం మరింత పెరుగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఈ సాహసం చేస్తారా..? మాట మీద నిలబడతారా..? అనేది ప్రశ్నార్థకం.
చంద్రబాబు ఇచ్చేవన్నీ ఎన్నికల హామీలే, ఫలితాల తర్వాత ఆ హామీలు నెరవేర్చడం ఆయనకు సాధ్యం కాదని వైసీపీ ముందుగానే హెచ్చరించింది. కానీ జనం మాత్రం చంద్రబాబునే నమ్మారు, ఓటు వేశారు. వైరి వర్గం తాను నమ్మకస్తుడ్ని కాదు అని చెప్పినా జనం నమ్మి ఓటు వేసినందుకు చంద్రబాబు నిజంగానే కృతజ్ఞత చూపిస్తారా..? 2019లో రైతు రుణమాఫీ విషయంలో మోసం చేసినట్టు, పెన్షన్ల విషయంలో కొర్రీలు వేసి కొంప ముంచుతారా అనేది తేలాల్సి ఉంది.
భారీ హామీలు..
పెన్షన్ల విషయంలోనే చంద్రబాబు భారీగా హామీలిచ్చారు. ప్రస్తుతం 3వేల రూపాయలుగా ఉన్న సామాజిక పెన్షన్ ని వచ్చే ఐదేళ్లలో 3,500 రూపాయలకు పెంచుకుంటూ పోతానన్నారు జగన్. కానీ చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4వేలు ఇస్తానన్నారు. అంతే కాదు, మూడు నెలల బకాయిలు కూడా కలిపి ఇచ్చేస్తానన్నారు. అంటే జులై-1న పెన్షన్ లబ్ధిదారులకు రూ.4వేల పెన్షన్, రూ.3వేల బకాయిలతో కలిపి మొత్తం రూ.7వేలు అందాలనమాట. ఇక వికలాంగులకయితే పెన్షన్ రెట్టింపు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.3వేలు తీసుకుంటున్న వికలాంగులకు రూ.6వేలు ఇస్తానన్నారు చంద్రబాబు. ఇవన్నీ అమలులోకి వస్తే.. ఇకపై నెలకు రూ.2,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కతీశారు అధికారులు. మరి చంద్రబాబు నిర్ణయం ఏంటో తేలాల్సి ఉంది. ప్రమాణ స్వీకారం రోజయినా దీనిపై ఆయన స్పష్టత ఇస్తారేమో చూడాలి.